సినీ ప్రేక్షకులంతా ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” మేనియాలో ఉన్నారు. రాజమౌళి కళా ప్రతిభకు ముగ్ధులైన ప్రేక్షకులు, రిటర్న్ గిఫ్ట్ రూపంలో కోట్లాది రూపాయల కలెక్షన్స్ ను కానుకగా ఇస్తున్నారు. పది రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద “ఆర్ఆర్ఆర్” హవా ఏ మాత్రం తగ్గలేదు.
ఫస్ట్ మండే కాదు, సెకండ్ మండే కూడా మంచి రెవిన్యూ రాబట్టే విధంగా ప్రేక్షక ఆదరణ ఉండడంతో, ఈ మేనియా తగ్గాలంటే మరికొంతకాలం గడవాల్సిందే. అయితే మరో నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వరుణ్ తేజ్ “గని” రూపంలో రాబోతున్నారు.
ఈ సినిమా కోసం వరుణ్ తీవ్రంగా శ్రమించారన్న విషయం ధియేటైరికల్ ట్రైలర్ ను చూస్తేనే అర్ధమవుతుంది. ఈ విషయాన్నే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ కూడా తెలిపారు. ఈ క్యారెక్టర్ కోసం వరుణ్ పడిన శారీరక శ్రమ ప్రతి షాట్ లో కనపడుతోంది. అయితే చిక్కల్లా “ఆర్ఆర్ఆర్” తోనే!
సిల్వర్ స్క్రీన్ పైన “ఆర్ఆర్ఆర్” వంటి అద్భుతాన్ని వీక్షించిన కళ్ళతో, ఓ రొటీన్ రివేంజ్ స్పోర్ట్ డ్రామాను ప్రేక్షకులు తిలకించగలరా? అంటే ‘చరిత్ర’ మాత్రం వరుణ్ కు అనుకూలంగా లేదు. ఒకవేళ ప్రేక్షకులను మెప్పించగలిగితే మాత్రం అది వరుణ్ కష్టానికి లభించిన ప్రతిఫలంగానే భావించవచ్చు.
మెగా హీరోగా వరుణ్ కు కావాల్సినంత బేస్ అయితే ఉంది గానీ, ఇప్పటివరకు రావాల్సిన ‘స్టార్’ ఇమేజ్ మాత్రం అందనంత దూరంలో ఉంది. దీనికి తాను ఎంచుకుంటున్న విభిన్నమైన పాత్రలు కారణం కావచ్చు. కానీ మెగా ఫ్యామిలీ అండదండలు పుష్కలంగా ఉన్న వరుణ్ ఉండాల్సిన స్టేటస్ లో లేరన్నది మాత్రం వాస్తవం. ఈ “గని” అయినా వరుణ్ ట్రాక్ ను మారుస్తుందేమో చూడాలి.



