
భాషాభిమానం గురించి చెప్పుకోవాలంటే ముందుగా తమిళ ప్రజలు, పాలకుల గురించే చెప్పుకోవాల్సి ఉంటుంది. అందరూ తమ మాతృభాషలో మాట్లాడుకుంటారు. తమిళంలో మాట్లాడుకోవడం గౌరవంగా భావిస్తారు. తమ భాష తప్ప మరో భాష అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తుంటారు.
తమిళుల మాతృ భాషాభిమానం ఈ స్థాయిలో ఉంటే, తెలుగువారికి తెలుగు భాషపై మమకారం ఎప్పుడో పోయింది. తెలుగులో మాట్లాడటం నామోషీగా భావించేవారున్నారు. పెంపుడు కుక్కలతో కూడా ఇంగ్లీషులో మాట్లాడేవారు కోకోల్లలున్నారు.
ఇంగ్లీసు మాట్లాడలేనివారిని నిరక్షరాస్యులుగానే పరిగణిస్తారు. తెలుగులో మాట్లాడటం, వ్రాయడం, చదవడం రానివారు, రాదని గొప్పగా చెప్పుకునేవారు కూడా ఉన్నారు.
తమిళులు తమ మాతృభాషని స్వర్ణ సింహాసనంపై కూర్చోబెట్టి గౌరవించుకుంటుంటే, మనమేమో మన తెలుగు భాషని సంకరం చేసేసుకొని, కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకునే దుస్థితిలో ఉన్నాము.
ఈ నేపధ్యంలో నేటి నుంచి గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు మొదలయ్యాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. శ్రీనరసింహ, గుంటూరు మేయర్ కే. రవీంద్ర తదితరులు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు.
నేటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఒక ప్రధాన వేదికతో పాటు మొత్తం 5 వేదికలు ఏర్పాటు చేశారు. ఒకే సమయంలో ఒక్కో వేదికపై ఒక్కో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ సభలలో తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు, కాలక్రమంలో భాషలో వచ్చిన మార్పులు, తెలుగు భాష ఔనత్యం వంటి అంశాలపై పలువురు మేధావులు, పండితులు, రచయితలు, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి.
ఇతర వేదికలపై సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, కవులు, రచయితలు, తెలుగు భాషని కాపాడుకోవడం కోసం శ్రమిస్తున్నవారికి సన్మానాలు వగైరా ఉంటాయి.
తెలుగు భాషకి తెలుగు సినిమాలకు మద్య అవినాభావ సంబంధం ఉంది. కనుక ఈ మహా సభలలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారు.
అలాగే తెలుగు జానపద, పౌరాణిక, సాంఘిక భాష గొప్పదనం చాటిచెప్పిన సినిమాల పరిచయం, వాటిలో తెలుగు సాహిత్యం గొప్పదనం చాటి చెప్పిన పాటల కార్యక్రమాలు ఉంటాయి. తెలుగు నాటక రంగానికి సంబంధించి ప్రముఖులు కూడా ఈ మహాసభలలో పాల్గొంటారు.
తెలుగు వంటలు, పిండి వంటలు, పురాతన మరియు సమకాలీన సాహిత్యానికి సంబంధించి పుస్తకాల ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలు, విశ్వశాంతి కొరకు హోమాలు నిర్వహిస్తారు. ప్రతీరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రపంచ తెలుగు మహాసభలతో తెలుగు భాషని కాపాడుకోగలమా? అంటే అవునని చెప్పలేము. కానీ చారిత్రిక, పురాతన వస్తువుల ఔనత్యాన్ని గుర్తు చేసే మ్యూజియంలా, ఈ ప్రపంచ తెలుగు మహాసభలు మనకు మన తెలుగు భాష ఔనత్యాన్ని గుర్తు చేసేందుకు తప్పక ఉపయోగపడతాయని చెప్పవచ్చు.
Ram Charan faced one of the biggest setbacks of his career with Zanjeer, which was…
Five films are now lined up around the Dasara weekend, but calling it a five-way…