వైసీపీకి గ్రహాలు కూడా రివర్స్‌లోనే… ఇదేంటబ్బా?

YSRCP Partyరివర్స్ టెండరింగ్‌తో రాష్ట్రాన్ని రివర్స్ గేరులో స్టార్ట్ చేసిన వైసీపీకి గ్రహాలు కూడా రివర్స్‌లోనే తిరుగుతున్నట్లున్నాయి. మొదటి రెండేళ్ళు హనీమూన్ బాగానే సాగిపోయింది. కానీ మంత్రులు మాజీలవడం, మూడు రాజధానులకి హైకోర్టు బ్రేకులు వేసి నిలిపేస్తే సుప్రీంకోర్టు కూడా పరిస్థితి అర్ధం చేసుకోకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తుండటం, ఎమ్మెల్యేల గురించి ఐ-ప్యాక్ హెచ్చరికలు, దాంతో పార్టీలో అప్పుడే లుకలుకలు, ఓ పక్క తరిగిపోయిన ఋషికొండ, మరోపక్క అనకొండలా పెరిగిపోతున్న అప్పులు, జీతాల కోసం నెలనెలా ఉపాధ్యాయుల రోడ్లెక్కి గోలగోల చేస్తుండటం, ఉద్యోగ సంఘాల హెచ్చరికలు… ఒకటా రెండా… ఎటు చూసినా సమస్యలే!

ఇవన్నీ సరిపోవన్నట్లు ఓ పక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అండ్ సన్స్, వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అండ్ కో అడ్డంగా బుక్కై ఉన్నారు. ఎవరికి ఎప్పుడు సీబీఐ నుంచి పిలుపు వస్తుందో, ఎవరెవరు లోపలకి వెళ్తారో ఎవరు బయట ఉంటారో తెలీని పరిస్థితి!

ADVERTISEMENT

అప్పటికీ ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు, బడ్జెట్‌ కేటాయింపుల గురించి నోరెత్తకుండా ఢిల్లీ పెద్దల ముందు తలదించుకొని ఎంత వినయంగా నిలబడినప్పటికీ, ఈ రెండు కేసుల విచారణ నానాటికీ స్పీడ్ అందుకొంటోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్ చేయడంతో తర్వాత ఎవరు?ఎప్పుడు? ముందు ఏపీ నుంచా లేక తెలంగాణ నుంచా?అనే చర్చ నడుస్తోంది.

ఇక ఆనాడు ఎన్నికల సమయంలో వివేకా హత్య కేసుని టిడిపి మెడకి చుట్టి లబ్ధి పొందినప్పటికీ, ఇప్పుడు అదే మళ్ళీ వైసీపీ మెడకి చుట్టుకొంటోంది. ఈ కేసులో నిందితులలో ఒకడైన సునీల్ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, అతని వ్యక్తిగత స్వేచ్చకంటే సాక్షుల భద్రతే ముఖ్యమని చెపుతూ బెయిల్‌ తిరస్కరించింది. అంటే ఈ కేసులో సీబీఐ ఒక్కో అవరోధం అధిగమిస్తూ ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంకా ముందుకు సాగితే ఏమవుతుందో?

కనుక వైసీపీకి ఈ సమస్యలు రావణాసురుడి తలల్లా ఎన్నిసార్లు కత్తిరిస్తున్నా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి. నాలుగేళ్ళు మూడు ముక్కలాటతో కాలక్షేపం చేసిన తర్వాత, ఎన్నికల సంవత్సరంలో ఇన్ని సమస్యలు, ముఖ్యంగా మెడకి చుట్టుకొంటున్న ఈ కేసులు చూస్తే వైసీపీ గ్రహస్థితి ఏమీ బాగున్నట్లు లేదు. బహుశః వైసీపీకి గ్రహాలు కూడా రివర్స్‌లో తిరుగుతున్నాయేమో అనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories