వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఏమవుతోంది? ఈ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం చాలా కష్టం గానీ, ఈ కేసు నుండి ఒక్కొక్కరుగా బయట పడుతుండడం కీలక పరిణామంగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పలువురు ఐఏఎస్ లు, పారిశ్రామిక వేత్తలు బయటపడగా, తాజాగా దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియాకు విముక్తి లభించింది.
సున్నపురాయి గనులకు సంబంధించి ‘క్విడ్ ప్రోకో’ జరిగిందని సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కడప జిల్లాలో జయా మినరల్స్ కంపెనీకి కేటాయించిన సున్నపు రాయి గనుల తవ్వక అనుమతులను, తొలుత సజ్జల దివాకర్ రెడ్డి కంపెనీకి, ఆపై దాల్మియాకు బదిలీ చేశారని, అందువల్లే జగన్ సంస్థల్లో పునీత్ దాల్మియా భారీ పెట్టుబడులు పెట్టారని సీబీఐ అభియోగాలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై హైకోర్టుకు వెళ్లిన పునీత్.., ఈ కేసులతో తనకేమీ సంబంధం లేదని వాదించారు. దాల్మియాపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడ్డ హైకోర్టు, దాల్మియాపై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో అసలు జగన్ అక్రమాస్తుల కేసు చివరికి ఏమవుతుందో అన్న టాక్ మళ్ళీ తెరపైకి వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో అప్పటి కేంద్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందన్న ‘జగన్ అండ్ కో’ వర్గాలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వెనుక తాజా కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందంటారేమో..!





