వైయస్ రాజశేఖర్ రెడ్డికి “విలువలు” లేవంటున్న జగన్?

YS Jaganప్రతిపక్షానికి చెందిన నలుగురు పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీ చేర్చుకోవడంతో అలెర్ట్ అయిన వైఎస్సార్సీపీ మిగతా సభ్యుల ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో అధికార పార్టీ తీరుపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలకు తెరలేపింది. తెలంగాణా ఒక వైఖరి, ఏపీలో మరో వైఖరిని తెలుగుదేశం పార్టీ ఎలా అవలంభిస్తుంది… ఓ పక్కన పార్టీ ఫిరాయింపులతో బాధపడుతూ, మరోవైపు అదే ఫిరాయింపులను ఎలా ప్రోత్సహిస్తుంది..? అని మండిపడుతున్నారు.

తెలుగుదేశం అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని… వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ జగన్ మీడియా విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇందులో నిజానిజాలను కాసేపు పక్కనపెడితే… అసలు ఈ పార్టీ ఫిరాయింపులను గత దశాబ్ద కాలంలో ముందుగా ఎవరు ప్రోత్సహించారు? ఈ ‘ఆపరేషన్ ఆకర్ష్’కు శ్రీకారం చుట్టింది ఎవరు? అని విశ్లేషణ చేసుకుంటే… తెరపైకి వచ్చే ఏకైక పేరు వైయస్ రాజశేఖర్ రెడ్డి.

ADVERTISEMENT

‘ప్రతిపక్షం అసలు ఉండకూడదు’ అంటూ వైయస్ తీసుకున్న నినాదంతో నాటి తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా కాంగ్రెస్ బాట పట్టించిన ఘనత వైఎస్సార్ ది. ఒకానొక సమయంలో అయితే అసలు తెలుగుదేశం పార్టీ బ్రతికి ఉంటుందా..? అన్న విశ్లేషణలు పెద్ద ఎత్తున జరిగాయి. అంతలా ‘ఆకర్ష్’ ఆపరేషన్ ను విజయవంతం చేసారు వైయస్. పార్టీ మార్పులు అన్నవి ఎప్పుడూ సహజంగా ఉంటాయి. కానీ, వైయస్సార్ దానిని పతాక స్థాయికి తీసుకువెళ్ళి, ఏకంగా ప్రతిపక్షం నిర్వీర్యం కావాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేసారు. చాలా సందర్భాలలో బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేసారు కూడా!

మరి జగన్ మీడియా చెప్తున్న ప్రకారం అయితే, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అస్సలు విలువలు గానీ, నైతికత గానీ లేని రాజకీయాలు చేసారని వారి మీడియా ద్వారా ప్రసారాలు చేసినట్లే కదా..! అన్న కధనాలు నెటిజన్లలో చర్చనీయాంశమయ్యాయి. తన తండ్రి పాలనే ‘సువర్ణ పాలన’గా చెప్పుకునే జగన్, అదే తండ్రి విధివిధానాలను ఇపుడు ఏకరువు పెడుతున్నట్లే కదా! అన్న ప్రశ్నలకు ఎవరు బదులిస్తారు? తప్పు ఎవరు చేసినా తప్పే… ఆనాడు వైయస్ మొదలుపెట్టిన “నిర్వీర్య” రాజకీయాన్ని ఇటీవల కేసీఆర్ అమలు చేసారు. అయితే ఉన్నంతలో అలాంటి ప్రయత్నాలను చాలా తక్కువ మోతాదులో చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఇప్పటివరకు చంద్రబాబు చేర్చుకున్నది కేవలం నాలుగు మందినే అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

నిజానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినది మొదలు… రెండు మాసాల తర్వాత నుండి 31 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. మరి ఆ సమయం రెండు సంవత్సరాల పాటు ఎందుకు సాగింది… అంటే ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలాంటి విషయాలను ప్రోత్సహించక పోవడమే! అయితే మారుతున్న రాజకీయాలకు తానూ కూడా మారాలన్న నినాదం బహుశా భూమా వంటి వారిని చేర్చుకోవడానికి దోహదపడిందేమో! లేదంటే జగన్ తనంతటగా తానూ చేసిన ప్రేలాపన వ్యాఖ్యలకు ఎంతటి మూల్యాన్ని చెల్లించుకుంటారో చాటి చెప్పడానికి చేసారేమో!

ADVERTISEMENT
Latest Stories