
అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి చంచల్‌గూడా జైల్లో ఉన్నప్పుడు వైసీపిని కాపాడి భద్రంగా అన్న చేతిలో పెట్టిన చెల్లి షర్మిలే, ఇప్పుడు ‘మా అన్నయ్యను మళ్ళీ గెలిపించకండి…’ అంటూ ప్రజలకు నచ్చజెపుతుండటం దేవుడి విచిత్రమైన స్క్రిప్ట్ అనే అనుకోవాలి.
వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ‘మేమందరం సిద్దం’ బస్సు యాత్రలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరుతున్నపుడు విజయమ్మ ప్రభువుని ప్రార్ధించి కొడుకుకి విజయం కలగాలని ఆశీర్వదించి పంపారు. ఇప్పుడు కూతురు షర్మిల హైదరాబాద్ నుంచి కడప జిల్లాలో బస్సు యాత్రకు బయలుదేరుతున్నప్పుడు ఆమెను కూడా విజయమ్మ ఆశీర్వదించి పంపారు.
వైఎస్ షర్మిలతో పాటు ఆమె సోదరి (వివేకా కుమార్తె) సునీతా రెడ్డి కూడా ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అదే బస్సులో ఆమెతో పాటు కడప బయలుదేరారు. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని బహుశః విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల, సునీతారెడ్డి ఎవరూ కూడా ఊహించి ఉండరు.
శుక్రవారం ఉదయం కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఆమగంపల్లి నుంచి వారిరువురూ తమ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.
అక్కడ షర్మిల స్థానిక ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కడప నుంచి నేను ఎంపీగా పోటీ చేయాలనే మా చిన్నాన్న చివరి కోరికని తీర్చడానికే ఈరోజు మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నాను. హంతకులు, హత్యా రాజకీయాలు చేస్తున్నవారు చట్టసభలలోకి ప్రవేశించనీయకూడదని నేను మీ అందరినీ కోరుతున్నాను.
నేను మా చిన్నానకు న్యాయం జరగాలని కోరుకొంటున్నాను. అవతలి వైపు మా చిన్నానను చంపిన హంతకులు పోటీ చేస్తున్నారు. ఇటు మీ రాజశేఖర్ బిడ్డ ధర్మం కోసం పోరాడుతూ మీ సాయం కోరుతోంది. అటు మా చిన్నానను చంపిన హంతకులు డబ్బు వెదజల్లి ఎన్నికలలో మళ్ళీ గెలవాలని ప్రయత్నిస్తున్నారు. కనుక న్యాయం, ధర్మం గెలిపించేందుకు ఈసారి ఎన్నికలలో వైసీపిని ఓడించి జగనన్నను గద్దె దించాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని వైఎస్ షర్మిల అన్నారు.
ఆనాడు జగనన్న తన రాజకీయ ప్రత్యర్ధులపై సంధించిన బాణమే ఇలా వెనక్కు తిరిగి వచ్చి కడప కంచుకోటని బద్దలు కొడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎవరూ ఊహించని ఇటువంటి చిత్రాలే దేవుడి స్క్రిప్ట్ నిండా ఉంటాయి. ఆ స్క్రిప్ట్ లో ఇప్పటికే ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఏవిదంగా ఉండబోతున్నాయో కూడా వ్రాసేసే ఉంటాడు. భవిష్యత్ అందుకు తగ్గట్లుగానే ఇటువంటి అనూహ్య పరిణామాలన్నీ జరుగుతున్నట్లున్నాయి. ఏవిటో ఈ స్క్రిప్ట్ ఎప్పుడూ అర్ధం కాదు!
Vijay Deverakonda has an interesting history at the box office with Rajinikanth. On two previous…
Crazy Kalyanam stars VK Naresh, Anupama Parameswaran, Tharun Bhascker and Akhil Uddemari of Raju Weds…