రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు వేరయ్యాయి. కానీ నేటికీ వాటి రాజకీయాలు మాత్రం వేరు కాలేదు. ఏపీలో వైసీపీకి బీఆర్ఎస్ పార్టీతో మంచి దోస్తీ ఉంది. అందుకే రెండు పార్టీలు, వాటికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు కూడా పరస్పరం సహకరించుకుంటుంటాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కూటమి, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధాలు లేనప్పటికీ, అవి పరస్పరం సహకరించుకుంటున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూనే ఉంటుంది.
కృష్ణా, గోదావరి నీటిని ఎత్తిపోసి తెలంగాణ రైతులకు అందించకుండా ఏపీకి వదిలేస్తుండటమే ఇందుకు ఉదాహరణ అని వాదిస్తుంటుంది.
ఇక 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఓడించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ చాలా తోడ్పడ్డారని, అందుకు ప్రతిగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్‌కు భారీ ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చారనేది బహిరంగ రహస్యం.
కనుక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలో ఉంది? ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు? వారి మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? అనేది పొరుగు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుందని స్పష్టమవుతోంది.
అలాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీల కొత్త స్నేహాలు లేదా కొత్త రాజకీయ సమీకరణలు కూడా పక్క రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
ప్రస్తుతానికి ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు ‘సింగిల్ సింహాలు’గానే ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం వాటి మనుగడకు చాలా అవసరం. కనుక బలమైన సింహంతో జతకట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉంది? ఎవరు అధికారంలో ఉన్నారు? అనేది కూడా రాష్ట్రస్థాయి రాజకీయాలపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. కనుక ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ, రాకూడదని వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు కోరుకోవడం సహజం.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ‘వర్తమాన శత్రువు’ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీయే. కనుక ఆ పార్టీతో లేదా దాని నేతృత్వంలోని ఇండియా కూటమితో చేతులు కలపడం కష్టం. అలాగని తమ రాజకీయ పతనానికి కారణమైన బీజేపీతో దోస్తీ చేయడం కూడా కష్టమే.
ఇక ఏపీలో వైసీపీకి కూడా సరిగ్గా అటువంటి సమస్యే ఉంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. అక్కడ ఎన్డీయేలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నందున బీజేపీతో లేదా ఎన్డీయే కూటమితో వైసీపీ జతకట్టలేదు.
కాంగ్రెస్ పార్టీయే తనను అక్రమాస్తుల కేసుల్లో ఇరికించి జైలుకు పంపిందని జగన్ వాదిస్తుంటారు. కనుక కాంగ్రెస్‌తో లేదా దాని నేతృత్వంలోని ఇండియా కూటమితో చేతులు కలపడం కూడా కష్టమే.
కనుక వైసీపీ, బీఆర్ఎస్ రెండూ ఒకే బాటలో సాగక తప్పదు. అయితే ఏ విధంగా ముందుకు సాగుతాయనేది ఎన్నికల నాటికి స్పష్టత వస్తుంది. అదే వాటి రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది.






