బీఆర్ఎస్‌కు లేని అవకాశం వైసీపీకి ఉంది.. మరెందుకు ఆలస్యం?

Jagan and YSRCP INDIA alliance speculation

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత వర్ల రామయ్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘ఎక్స్‌’లో ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

“జగన్ గారూ! ఇంకా ఎందుకా ముసుగు? ఢిల్లీలో ఎన్డీయేకు మద్దతు, ఆంధ్రాలో దానికడ్డం. కొత్తగా ‘ఇండియా’ కూటమి పార్టీలతో మంతనాలు.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మద్దతుగా ట్వీట్లు.. సో.. ‘ఎన్డీయే’కు విడాకులిచ్చి ‘ఇండియా’లో చేరాలన్న మీ ఆరాటం కనపడుతుంది.. ఇంకెందుకు ఆలస్యం? ముసుగు తీయండి సార్!” అంటూ సూచించారు.

ADVERTISEMENT

రెండు పడవల ప్రయాణం ఎన్నడూ మంచిది కాదు. కనుకనే జగన్‌ ఎల్లప్పుడూ సింగిల్ సింహంలా బ్రతకాలనుకుంటారు. తనలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ కూడా బ్రతకాలని పిలుస్తుంటారు కూడా. కానీ జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు కూడా ఇంత ధైర్యం లేదు. కనుక అవి కూడా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకునే చక్రం తిప్పుతుంటాయి.

కనుక దేశంలో సింగిల్ సింహాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. పొరుగు రాష్ట్రంలో ఓ సింగిల్ సింహం ఉండేది. కానీ అది ఓ ఉప ఎన్నిక కోసం వామపక్షాలతో పొత్తు పెట్టుకొని ‘ఆ టైటిల్’ కోల్పోయింది.

అయితే అంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌, అంత హిస్టరీ ఉన్న జాతీయ పార్టీలే మన వైపు ఆశగా లేదా ఓరగా చూస్తున్నప్పుడు.. మనం కూడా వాటిని ఓర కంట చూస్తే తప్పేమిటి? అని సింగిల్ సింహాలు అనుకోవడం కూడా తప్పు కాదు.

కనుక కేసీఆర్‌, జగన్‌ అలానే చూస్తుంటారనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందువల్లే ద్రౌపదీ వస్త్రాపహరణంలో శ్రీకృష్ణుడిలా వారిని ఏదో అదృశ్యశక్తులు కాపాడుతున్నాయని గిట్టనివారు చెవులు కొరుక్కుంటారు.

అయితే ఎంత సింహాలైనా ఎల్లకాలం సింగిల్‌గా జీవించలేవు. వాటికీ ఒక తోడు కావాలి. కనుక జగన్‌ ఇండియా కూటమి వైపు చూస్తున్నారనే ఊహాగానాలను ప్రస్తావిస్తున్న ఆ పెద్దాయన.. మరెందుకు ఆలస్యం? అని అడుగుతున్నారు.

మడమ తిప్పమని కూర్చుంటే బిగుసుకుపోతుంది. ఆ తర్వాత అడుగు ముందుకు వేయడం కష్టం. కనుక అవసరం పడినప్పుడల్లా మడమ తిప్పుతూనే ఉండాలి.

కానీ ఇద్దరు బద్ద శత్రువులున్న ఎన్డీయేలోకి వెళ్ళడం కంటే, లౌకికవాదానికి పేటెంట్ హక్కులు కలిగిన కాంగ్రెస్‌ నేతృత్వంలో ఇండియా కూటమి అయితే బెటర్. పైగా దాని మిత్రులే ఏదో వంక పెట్టుకొని వచ్చి ప్యాలస్‌ తలుపు తట్టి ఆహ్వానిస్తున్నారు కూడా. కనుక కాస్త పాతదైనా ఆ టైటానిక్ పడవ ఎక్కేస్తే మంచిదేమో?

ADVERTISEMENT
Latest Stories