YSRCP-Purchur

“విలువలు, విశ్వసనీయత” అంటూ మొదలు పెట్టిన వైసీపీ రాజకీయం “విద్వేషాలు, విధ్వంసాల” మధ్య తిరుగుతున్నాయి. రాజకీయంగా ఎదగడానికి తొక్కాల్సిన ప్రతి అడ్డదారి తొక్కుతూ, చెయ్యాల్సిన ప్రతి అరాచకాన్ని చేస్తూ ఎదుటివారి మీద నిందలు వేస్తూ వినోదం చూసే వైసీపీ నేతల పాపాల పొద్దు ముగిసింది. దీనితో ఒక్కో వైసీపీ శిశిపాలుడు లెక్క ప్రజల ముందు ప్రత్యక్షమవుతుంది.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?

మొన్న శాంతి, సాయిల వివాదం, నిన్న దువ్వాడ, మధురిమల పంచాయితీ, నేడు అనంతబాబు అస్లీలం. ఇలా ఒక్కో వైసీపీ నేత నిజ స్వరూపం మీడియా కెక్కడంతో వైసీపీ పార్టీ నైతికంగా కుంగిపోతుంది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన ఈ వైసీపీ నేతల భాగోతాలు ఇప్పుడు రోడ్డెక్కాయి. అయినా పార్టీ అధినేత జగన్ నుంచి కనీస స్పందన లేదు. అలాగే వారి పై ఎటువంటి చర్యలకు ఆదేశాలు ఇవ్వలేదు.

ఇటువంటి వారికీ రాజకీయ ఆశ్రయం కల్పించిన జగన్ ఎదుటి వారి వ్యక్తిగత జీవితాల పై బురద జల్లడం, బజారుకెక్కి మాట్లాడడం ఆయన విలువలకు నిదర్శనం అంటున్నారు జనసైనికులు. విషయం నాదాకా వస్తే కానీ పవన్ ఆవేదన అర్ధం కాలేదు అంటూ దువ్వాడ ఏడుస్తున్న దొంగ ఏడుపులు, నా మీద రాజకీయ కక్షతోనే మార్పింగ్ వీడియోలను సృష్టిస్తున్నారు అంటున్న అనంతబాబు చెపుతున్న కట్టుకథలు, నా వయస్సుని గుర్తించండి అంటున్న సాయి రెడ్డి విన్యాసాలు అన్ని కలగలిపి వైసీపీ ని పాతాళానికి నెట్టేస్తున్నాయి.

Also Read – మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?

వైసీపీ నేతలు సంజాయిషీలు చూస్తుంటే “వినేవాడు చెవిటోడు అయితే చెప్పేవాడు బుద్ధిమంతుడే” అనే చందంగా ఉంటున్నాయి. 151 సీట్లతో అధికారాన్ని చేపట్టిన వైసీపీ గడిచిన ఐదేళ్లలో ఎన్నో బటన్ నొక్కుడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పటికీ 11 సీట్లకు పరిమితం కావడం వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యాలలో ఇది ఒకటి కావచ్చు.

ఐదేళ్లు చేతిలో అధికారాన్ని పెట్టుకుని కూడా కోడి కత్తి కేసుకు ఒక ముగింపు ఇవ్వలేక పోయింది, వివేకా దారుణ హత్యకు నాయ్యం చెయ్యలేక పోయింది వైసీపీ ప్రభుత్వం. అలాగే బాబు మీద పెట్టిన కేసులకు సాక్ష్యాలు చూపలేకపోయింది. కానీ అధికారానికి దూరమైన రెండు నెలల లోపే వైసీపీ ఎన్నో వివాదాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సొంత చెల్లెల్లు షర్మిల, సునీత ల పై వ్యక్తిగత దాడికి పురికొల్పింది.

Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?

పవన్ పెళ్లిళ్ల మీద రాజకీయం చేయడం, రాజకీయాలతో సంబంధం లేని మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టడం, అనుభవానికి, వయస్సుకి కూడా విలువివ్వకుండా బాబుపై మానసిక దాడిని ప్రోత్సహించడం వైసీపీ పతనానికి మరో కారణంగా చెప్పవచ్చు. తల్లితో విభేదాలు, చెల్లెలుతో విద్వేషాలు, ప్రతిపక్షాలతో వైరాలు పెట్టుకుని చివరికి సొంత పార్టీ నేతల వ్యక్తిగత వివాదాలతో పార్టీ పరువును బజారు పడేకుంటున్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం అనే నినాదంతో ముందుకెళ్లిన వైసీపీ గడప గడపలో ఒక పంచాయితీని సృష్టించుకుని ఇప్పుడు దాని తాలూకా ఫలితాలను అనుభవిస్తుంది. రాజకీయాలలో గెలుపు ఓటములు అనేది సర్వ సాధారణమైన విషయమే కానీ రాజకీయ పార్టీలు రాజకీయంగా ఓడితే ఏదోనాడు బలపడతాయి కానీ నైతికంగా దిగజారితే తిరిగి ఎదగడం అంత సులువు కాదు.

వైసీపీ ప్రభుత్వ పాలన తీరు నచ్చక, ప్రభుత్వ నిర్ణయాలతో ఏకీభవించలేక వైసీపీ పార్టీని ప్రజలు రాజకీయంగా ఓడిస్తే ఈ సెన్సార్ డైలాగ్స్ తో, సెన్సార్ సీన్లతో, సొంత పార్టీ నేతల వికృత చేష్టలతో, అనవసరమైన వాటి పై ఆవేశ పడుతూ అవసరమైన వాటి పై మౌనం వహిస్తు జగన్ ప్రజలలో పలుచనవుతున్నారు, పార్టీని పలుచన చేస్తున్నారు.




దీనితో ప్రజలు వైసీపీని రాజకీయంగా ఓడిస్తే పార్టీ మాత్రం తన చర్యలతో నైతికంగా ఓడిపోయింది అనే అభిప్రాయం నానాటికి బలపడుతుంది. ఈ ఆరోపణలు వైసీపీ ని చాప కింద నీరులా ముంచేసే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా జగన్ తన మౌన నిద్రను వీడి పార్టీ నేతలను కట్టడి చేసి గాడిన పెట్టకపోతే వైసీపీ కూడా షర్మిల టి. వైస్సార్ కాంగ్రెస్ పార్టీల కాలగర్భంలో కలిసిపోయే అవకాశం లేకపోలేదు.