తాడికొండ వైసీపీలో డొక్కా చిచ్చు… రగిలిపోతున్న ఎమ్మెల్యే శ్రీదేవి

YSRCP-YS-Jagan-Dokka-Manikya-Vara-Prasad-Vundavalli-Srideviగుంటూరు జిల్లా తాడికొండలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రవేశించి వైసీపీలో చిచ్చురగిలించారు. ఆయనను తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా నియమించడాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండురోజుల క్రితం ఆమె తన అనుచరులతో కలిసి గుంటూరు వైసీపీ ఇన్‌ఛార్జి మేకతోటి సుచరిత ఇంటి ముందు అర్దరాత్రి వరకు ధర్నా చేశారు కూడా. మంగళవారం ఎమ్మెల్యే శ్రీదేవి తన అనుచరులను వెంటబెట్టుకొని మళ్ళీ మేకతోటి సుచరిత ఇంటి ముందు ధర్నా చేసి, డొక్కా మాణిక్యవర ప్రసాద్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ మీడియాతో మాట్లాడుతుండగా, పోలీసులు వచ్చి వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో వైసీపీ నేతలు షాక్ అయ్యారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని దీనిలో పోలీసులు ఎలా జోక్యం చేసుకొంటారని అసలు ఎవరి ఆదేశాలతో తమను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నేత జిలానీ, మాజీ ఎంపీటీసీ నాగేశ్వరరావు పోలీసులను ప్రశ్నించారు.

అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు మీడియాతో మాట్లాడుతూ, “పదవులు, అధికారం కోసం ఊసరవెల్లిలా పార్టీలు మార్చుతూ వైసీపీలోకి వచ్చిన డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ను తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా నియమించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మేము ఉండవల్లి శ్రీదేవిని గెలిపించుకొని ఆమె నేతృత్వంలో ఎంతో కష్టపడి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకొంటుంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ నియోజకవర్గంలో దూరారు. మా ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ కోసం, నియోజకవర్గంలో ప్రజల కోసం ఎంతగానో కష్టపడి పనిచేసి మంచిపేరు తెచ్చుకొంటే, మద్యలో డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ను తెచ్చి మా నెత్తిన పెట్టడం దేనికి? ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది కదా? ఇకనైనా డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ను ఇక్కడి నుంచి తొలగించాలి. లేకుంటే మేము ఆయనకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగిస్తాము,” అని హెచ్చరించారు.

ADVERTISEMENT

డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ను నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా నియమించడంతో వచ్చే ఎన్నికలలో ఆయనకు తాడికొండ టికెట్ ఇవ్వబోతున్నట్లు వైసీపీ అధిష్టానం సందేశం ఇచ్చినట్లు ఎమ్మెల్యే శ్రీదేవి (వర్గం) అనుమానిస్తోంది. డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ కూడా ఇటువంటి అవకాశం కోసమే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు కనుక తాడికొండలో పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నించడం ఖాయం. అందుకే ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories