‘అసలు విడుదల కాదు’ అని నిర్మాణ సంస్థతో సహా ప్రేక్షకులు కూడా వదిలేసిన సినిమాను “ఆరడుగుల బుల్లెట్” అని పవన్ కళ్యాణ్ సాంగ్ టైటిల్ పెట్టి, ఇటీవల కాస్త హంగామా సృష్టించారు చిత్ర యూనిట్. అంతేకాదు, అదే ఊపులో రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేసారు, ఇంకేముంది ఈ సినిమా ధియేటర్లలోకి వస్తుందన్న విషయం ఖరారైంది. అయితే మళ్ళీ వాయిదా పడడంతో, ఆర్ధిక లావాదేవీలు “ఆరడుగుల బుల్లెట్” చుట్టుముట్టాయన్న ప్రచారం ట్రేడ్ వర్గాలలో బలంగా జరిగింది. అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేని పక్షంలో ఇండస్ట్రీలో సహజంగా వినిపించే మాటలే ఈ ఆర్ధిక కష్టాలు.
ఓ పక్కన ఇలాంటి టాక్ హల్చల్ చేస్తుండగానే, చిత్ర యూనిట్ ఆడియో రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయడం విశేషం. ఆడియో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గా రెండు ‘పాత’ పోస్టర్లపై ‘కొత్త’ ముద్ర వేసి సోషల్ మీడియాలో విడుదల చేసారు. మేలో సినిమా విడుదల అని ప్రకటించి, జూన్ లో ఆడియో రిలీజ్ వేడుక ప్లాన్ చేయడం బహుశా ఈ “ఆరడుగుల బుల్లెట్” సినిమాకే చెల్లిందేమో అని చెప్పకతప్పదు. చెప్పుకోవడానికి పోస్టర్ పై అన్నీ బి.గోపాల్, మణిశర్మ, వక్కంతం వంశీ, అబ్బూరి రవి వంటి ‘బ్రాండెడ్’ పేర్లే ఉన్నాయి గానీ, సినిమా పోస్టర్లు, ట్రైలర్లు మాత్రం ‘నాన్ బ్రాండెడ్’ కంటే దారుణంగా ఉన్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.



