ధురంధర్‌కు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటర్వ్యూలు, ట్వీట్లతో ఆ సినిమాను, దర్శకుడు ఆదిత్య ధర్‌ను తెగ పొగిడారు. అసలు దర్శకుడే తన సినిమా గురించి వర్మంతగా మాట్లాడలేదేమో అనిపించేంత ప్రచారం చేశారు. ఇప్పుడు అదే ఆదిత్య ధర్ పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ఆసక్తికరంగా ఉంది.
కేజీఎఫ్‌కు ముందు యష్ గురించి తెలియదంటూ అల్లు అరవింద్ గతంలో చేసిన వ్యాఖ్యలపై యష్ తల్లి అభ్యంతరం చెప్పడాన్ని వర్మ తప్పుపట్టారు. ఆ మాటల ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ నిన్న ట్వీట్ చేశారు. ఇలాంటి స్పందనలు చూస్తే వాళ్లు అలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారో కూడా అర్థమవుతుందంటూ చురక వేశారు.
వర్మ ఇలా టాక్సిక్ వైపు విమర్శలు ఎక్కుపెడుతుంటే, ఆదిత్య ధర్ మాత్రం అదే సినిమాలో యష్‌ను ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ పెట్టారు. తాను అంతగా పొగిడిన దర్శకుడే, తన విమర్శలకు పూర్తి భిన్నంగా స్పందించడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం.
ఇక్కడ మరో ఆలోచన కూడా వస్తుంది. ధురంధర్ 2 తర్వాత ఆదిత్య ధర్ తన తదుపరి సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ ఆయన యష్‌తో సినిమా చేస్తే?
ధురంధర్‌లో రణ్‌వీర్ సింగ్ మోసిన తరహా మాస్ పాత్రను మోయగల మరో హీరోను బాలీవుడ్‌లో ఎంచుకోవడం అంత సులువు కాదు. యష్ మాత్రం ఆ స్థానానికి సరిపోతారు. భారీ మాస్ ఇమేజ్‌తో పాటు, సినిమా కోసం ఎంతైనా కష్టపడే తత్వం ఆయనకు ఉంది. ఆదిత్య ధర్‌కు అలాంటి హీరో దొరికితే, ఆ కలయిక ప్రకటనతోనే భారీ హైప్ తెచ్చుకుంటుంది.
అయితే ఆదిత్య ధర్ పెట్టిన స్టేటస్ వెనుక యష్‌తో సినిమా చర్చలున్నాయా అనేది తెలియదు. ప్రస్తుతానికి ఇది ఊహ మాత్రమే. ప్రశంసల పోస్ట్‌ను బట్టి సినిమా ఉంటుందని చెప్పలేం.
కానీ ఆ కాంబినేషన్ నిజమైతే మాత్రం, ఆదిత్య ధర్ భజనలో ముందుండే వర్మకే ఎక్కువ నిరాశ కలుగుతుందేమో!






