నందమూరి బాలకృష్ణ అఖండ-2లో భారతదేశంపైకి వస్తున్న చైనా మూకలను ఎదుర్కొని చీల్చి చెండాడారు. బాలయ్య నటన, ఉగ్రరూపం చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. బాలయ్యకు సరైన పాత్ర, సినిమా దొరికితే ఎలా చెలరేగిపోతారో అఖండ-2 చూస్తే అర్ధమవుతుంది.
ఈ సినిమాలో బాలయ్య చైనా మూకలను చీల్చి చెండాడారు కానీ సినీ పరిశ్రమలో మారు వేషాలలో తిరుగుతున్న శత్రువులని కాచుకోవడం చాలా కష్టమే.
అఖండ-2ని చూసిన ప్రేక్షకులు సినిమా చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేస్తుంటే, సినీ పరిశ్రమలో మాత్రం కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని స్వయంగా నిర్మాత రామ్ ఆచంట సినిమా సక్సస్ మీట్‌లో చెప్పారు.
రివ్యూలను తప్పు పట్టడానికి లేదని ఎవరి అభిప్రాయలు వారికి ఉంటాయి కనుక వాటిని గౌరవించాల్సిందేనన్నారు. కానీ అఖండ-2 విషయంలో పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం బాధ కలిగిస్తోందన్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రేక్షకుల అంతిమ తీర్పే తమకు ముఖ్యమన్నారు.
బాలయ్య, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. కనుక అది వారికి చాలా పెద్ద అడ్వాంటేజ్ అయ్యుండాలి. కానీ అదే కారణంగా వారి సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రతీసారి ఈవిధంగా దుష్ప్రచారానికి గురవుతూనే ఉన్నాయి. కానీ ఆ దుష్ప్రచారాలు వారి సినిమాలను ప్రభావితం చేయలేకపోతున్నాయి. సినిమా బాగుంటే హిట్ అవుతూనే ఉన్నాయి. హరిహర వీరమల్లు, అఖండ-2 ఇందుకు తాజా నిదర్శనాలే కదా?
సినీ పరిశ్రమ బయట ఉన్నవారికి సినిమాలు తీసి విడుదల చేయడంలో సాధకబాధకాలు పూర్తిగా తెలియవు. కనుక వారు ఏదేదో మాట్లాడుతుంటారు అని సరిపెట్టుకోవచ్చు. కానీ సినీ పరిశ్రమలో ఉంటూ కష్టం, నష్టం అన్నీ తెలిసినవారు కూడా ద్వేషం లేదా మరేదో కారణాలతో రిలీజ్ కాబోతున్న అయిన సినిమాలకు నష్టం కలిగించే విధంగా కుట్రలు చేయడం సబబేనా? అని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి.
నేడు ఇతరుల సినిమాని దెబ్బ తీస్తే రేపు మన సినిమాని ఇతరులు కూడా దెబ్బ తీయకుండా ఉంటారా? అయినా ఎవరి సినిమాలు వారివైనప్పుడు ఇతరుల సినిమాల గురించి ఈర్ష్య ద్వేషాలు అవసరమా?



