ఇండస్ట్రీలో ముప్పై సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవమున్న స్టార్ హీరో కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే ఏ రేంజ్ లో హంగామా ఉంటుందో వేరే చెప్పాలా. నిన్న నెలే షారుఖ్ ఖాన్ పఠాన్ ని జనం వెర్రెత్తినట్టు చూశారు. గొప్ప మూవీ కాకపోయినా ఈ మాత్రం యాక్షన్ మసాలా చూసి ఏళ్ళు గడవడంతో ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ ని దోసిట్లో పోశారు. రేంజ్ పరంగా పోలిక కరెక్ట్ కాదు కానీ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కున్న ఫాలోయింగ్ ని తీసిపారేయడానికి లేదు. టాయిలెట్ టైటిల్ పెట్టుకుని వందల కోట్లు కొల్లగొట్టిన ట్రాక్ రికార్డు ఉంది.
ఇప్పుడంతా తారుమారయ్యింది. సెల్ఫీ విడుదలైతే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా వచ్చాయి. అసలు మొదటి ఆట పడకుండానే పబ్లిక్ తిరస్కరించేశారు. తమకేమాత్రం ఆసక్తి లేదని తేల్చి పారేశారు. అలా అని ఇదేదో సామ్రాట్ పృథ్విరాజ్ లాగా ఓవర్ బిల్డప్ డ్రామా కాదు. రక్షా బంధన్ లాగా మితిమీరిన సెంటిమెంట్ కాదు. పోనీ బచ్చన్ పాండే లాగా పైత్యం నిండిన హీరోయిజమా అంటే అదీ లేదు. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ కు అధికారిక రీమేక్. బడ్జెట్ గట్రా భారీగా ఖర్చు పెట్టడం ట్రైలర్ లో కనిపించింది.
దర్శకుడు రాజ్ మెహతా ఒరిజినల్ కు కట్టుబడి కేవలం కొద్దిమార్పులతో దీన్ని తెరకెక్కించాడు. అసలు డ్రైవింగ్ లైసెన్స్ నిలబడిందే ఆర్టిస్టుల అద్భుతమైన పెర్ఫార్మన్స్ వల్ల. పృథ్విరాజ్ సుకుమారన్ – సూరజ్ వెంజరమూడులకు సరిసమానంగా కాకపోయినా అక్షయ్ తో పాటు ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ చక్కగా నటించినప్పటికీ సోల్ మిస్ అయిన కథలో అంతగా ఇమడలేకపోయారు. మాతృక చూడకపోయినా సెల్ఫీలో మరీ ఎగ్జైటింగ్ గా అనిపించేవి పెద్దగా ఉండవు. ఇద్దరి క్లాష్ ని మాత్రం చక్కగా హ్యాండిల్ చేశారు. మిగిలినవన్నీ అంతంత్ర మాత్రంగా ఉండటం వల్ల తేడా కొట్టేసింది.
సమస్య సినిమా బాగుండటం లేకపోవడం గురించి కాదు. అక్షయ్ లాంటి బడా స్టార్ కు ముందు రోజు మల్టీప్లెక్సుల్లో ఇండియా మొత్తం కేవలం పది వేల టికెట్ల కంటే తక్కువ అమ్ముడుపోవడం మరీ దారుణం. ముందు వెనుకా చూసుకోకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న అక్షయ్ కుమార్ కు ప్రేక్షకులు ఈ రకంగా గుణపాఠం నేర్పిస్తున్నారు. రీమేకులు తప్ప మరో ఊసు లేకపోతే మేము ఇంట్లోనే ఉంటామని తెగేసి చెబుతున్నారు. సెల్ఫీ సంగతి సరే అంతర్జాతీయం స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సూర్య ఆకాశం నీ హద్దురా రీమేక్ కూడా ఇతనే చేస్తున్నాడు. కనీసం దాన్ని అయినా డ్యామేజ్ చేయకపోతే సంతోషం.



