అక్రమాస్తుల కేసులకీ.. టీనేజ్‌ వచ్చేసింది

YS Jagan Assets Cases: ED Pushes for Daily Hearings in Court

2011వ సంవత్సరంలో పుట్టిన పిల్ల లేదా పిల్లాడి వయసు ఇప్పుడు ఎంత అంటే 15 ఏళ్ళు! అని టక్కున సమాధానం చెప్పగలం. అంటే టీనేజ్ అన్నమాట! నాడు దాఖలైన జగన్‌ అక్రమాస్తుల కేసులకు కూడా ఇప్పుడు టీనేజ్ వచ్చేసింది.

2011లో పుట్టిన పిల్ల, పిల్లాడు ఈ టీనేజ్ దాటిన తర్వాత జీవితంలో కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు చూస్తూ కనీసం మరో 65-75 సంవత్సరాలు జీవిస్తారు. కనుక ఈ అక్రమాస్తుల కేసులు కూడా అలాగే కలకాలం సాగుతూనే ఉండవచ్చు.

ADVERTISEMENT

ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, చివరికి నిందితులు, సాక్షులు అందరూ కూడా తమ తమ బాధ్యతల నుంచి రిటైర్ అయిపోవచ్చు. వారి స్థానంలో కొత్తవారు వస్తూనే ఉండవచ్చు. కానీ ఈ కేసులు మాత్రం ఇలాగే ‘ఉపాధి హామీ పధకం’లా అందరినీ ఆదుకుంటూనే ఉండవచ్చు.

కనుక ఈ కేసులలో అవినీతి ఎన్ని వందలు లేదా వేల కోట్లు జరిగిందని ఆలోచించడం కంటే ఈ కేసులతో ఎంత మంది లేదా ఎన్ని తరాలు బతుకుతున్నాయని ఆలోచిస్తే చాలు… మన ఆలోచనా దృక్పధమే సమూలంగా మారిపోతుంది.

అయితే అందరూ ఇలా పాజిటివ్‌గా ఆలోచించరు. వారిలో ఈడీ కూడా ఒకటి.

గత పదేళ్ళుగా ఈ కేసులన్నీ సీబీఐలో చిక్కడిపోయాయని ఇంకా ఎంత కాలం నాన్చుతారంటూ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ప్రతీరోజూ విచారణ జరిపించేయాలని, జగన్‌తో సహా నిందితులు అందరినీ విచారణకు హాజరవ్వాలని ఆదేశించాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరింది.

ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది వేరే విషయం. కానీ ఈడీ వేసిన ఈ కొత్త పిటిషన్‌ని సవాలు చేస్తూ నిందితులు కూడా మరో పిటిషన్‌ వేసే వెసులుబాటు దీంతో ఏర్పడింది.

కనుక రామాయణంలో పిట్టకథల్లా ఈ పిటిషన్‌పై మరో పిటిషన్‌తో ఈ కేసులలో మరికొంత ఎక్స్‌టెన్షన్ లభించినట్లే. ఇలా ఊహించడాన్ని ‘నెగెటివ్ థింకింగ్’ అనుకుంటే ఏమీ చేయలేం!

అయినా ప్రజలు జగన్‌ అక్రమాస్తుల కేసుల వార్తలు విని చాలా కాలమే అయ్యింది. కనుక ఓ వారం పది రోజులు వేసుకుంటే చూసేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.

నిజానికి ఈ ‘టీనేజ్ కేసు’పై ప్రజలు పూర్తిగా ఆసక్తి కోల్పోయారు కనుకనే ఇప్పుడు ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు. అందువల్ల కావచ్చు లేదా ఈ కేసులలో జగన్మోహన్ రెడ్డిని నిందితుడుగా కాక రాజకీయ బాధితుడుగా భావిస్తుండటం వలన కావచ్చు 39.97 శాతం ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు.

అందువల్లే ఆయన నేతృత్వంలో వైసీపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడగలుగుతోంది. కనుక మళ్ళీ తప్పకుండా అధికారంలోకి వస్తామని బల్లగుద్ది చెపుతోంది కూడా. ఈ కేసులు ఎప్పుడూ ఉండేవే!

ADVERTISEMENT
Latest Stories