‘అల్లరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నరేష్ ఆ తర్వాత మొదటి సినిమా టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చేసుకుని అల్లరి నరేష్‌గా స్థిరపడి పోయాడు. కెరీర్ ఆరంభంలో ఈయన సంవత్సరంలో అయిదు నుండి ఎనిమిది సినిమాల వరకు చేయడం జరిగింది. కాని గత సంవత్సరం నుండి ఈ అల్లరోడి అల్లరి కాస్త తగ్గింది. ముఖ్యంగా ఈ సంవత్సరం పెళ్లి కారణంగానో ఏమో కాని బొత్తిగా ప్రేక్షకులకు కనబడకుండా నల్లపూస అయ్యాడు. పెళ్లి తర్వాత ఈ అల్లరోడు మంచు హీరో మోహన్‌బాబుతో కలిసి ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే చిత్రంలో నటించాడు.
ఇటీవలే ఆడియో విడుదలైన ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రాన్ని ఇదే నెల చివర్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా విడుదల అవ్వకుండానే అల్లరోడు మరో సినిమాను షురూ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. గతంలో తాను హీరోగా నటించిన ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకులం’ చిత్రాన్ని తెరకెక్కించిన ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మరోసారి అల్లరి నరేష్ నటించేందుకు ఓకే చెప్పాడు. ఈ సినిమాను రామబ్రహ్మయ్య చౌదరి నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను అతి త్వరలో సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మళ్లీ మునుపటిలాగా అల్లరోడు వరుసగా సినిమాలు చేస్తానంటున్నాడు.





