తెలుగు సినీ పరిశ్రమని ఆంధ్రాకు విస్తరించాలని సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో సహా మంత్రులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు.
అయితే టాలీవుడ్ ప్రముఖులు ‘పొరుగు రాష్ట్రంలో నంది అవార్డుల ప్రదానోత్సవం ఎప్పుడు?’ ‘బారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్స్ పెంచండి.. బెనిఫిట్, ప్రీమియర్ షోలకు అనుమతించండి..’ అని అడుగుతారే తప్ప కనీసం ఆంధ్రాలో తప్పనిసరిగా షూటింగ్ కూడా చేయాలనుకోరు.
కానీ వైసీపీకి దగ్గరగా, కూటమి ప్రభుత్వానికి దూరంగా ఉన్నట్లు కనిపించే అల్లు అర్జున్ తన ఏఏఏ (ఏసియన్ అల్లు అర్జున్ సినిమాస్)ని విశాఖ నగరానికి విస్తరించారు.
విశాఖలోని ‘ఇనార్బిట్ మాల్’లో 8 స్క్రీన్స్‌తో ఏఏఏ నిర్మించబడింది. ఈ నెల 9న అల్లు అర్జున్ స్వయంగా దీనిని ప్రారంభించే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో, అమీర్‌పేట వద్ద ఏర్పాటు చేసిన ఇటువంటి మల్టీప్లెక్స్‌లో 75 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, అత్యాధునిక లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీ, అత్యుత్తమ డాల్బీ అట్మాస్ ఇమ్మర్సివ్ సరౌండ్ సౌండ్ వ్యవస్థ, అద్భుతమైన ఆడియో-విజువల్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి.
విశాఖలో ప్రారంభోత్సవం కాబోతున్న ఏఏఏలో కూడా వీటన్నిటితో పాటు ఇనార్బిట్ మాల్లో ప్రీమియం ఫుడ్ కోర్టులు, ప్రత్యేకంగా రూపొందించిన డిజైనర్ లాంజ్‌లు కూడా ఉన్నాయి.
కనుక తెలుగు సినీ ప్రముఖులు కనీసం అల్లు అర్జున్ స్పూర్తితో ఆంధ్రాకు సినీ పరిశ్రమని విస్తరిస్తే అందరూ సంతోషిస్తారు.





