స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. అదేంటి అల్లు అర్జున్ పెళ్లి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు కదా అనుకుంటున్నారా? అదేనండీ అల్లు అర్జున్ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఆ ఇంటికి ‘బ్లెస్సింగ్’ (ఆశీర్వాదం) పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.
దీనికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్‌మీడియా వేదికగా ఆయన అభిమానులతో పంచుకున్నారు. “మా కొత్త ఇంటికి భూమి పూజ చేశాం. దాని పేరు బ్లెస్సింగ్” అని ఆయన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాకుండా కుటుంబసభ్యులతో కలిసి భూమి పూజ చేస్తున్న ఓ ఫొటో సైతం అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇప్పుడు బ్లెస్సింగ్ గురించి ఆసక్తికర విషయాలు వినపడుతున్నాయి.
సిటీలోని ప్రైమ్ ఏరియాలో ఇంటి కోసం స్థలం కొన్నాడట బన్నీ. ఇల్లు కూడా అంతే గ్రాండ్ గా ప్లాన్ చేశాడంట. ఇంటి కట్టుబడి నుండి ఇంటీరియర్స్ వరకూ అంతా భారీ స్థాయిలో వేరే దేశం నుండి వచ్చిన ఎక్స్పర్ట్స్ తో చేయించే ప్లాన్ లో ఉన్నాడట బన్నీ.స్థలం నుండి ఇల్లు పూర్తి అయ్యే సమయానికి ఖర్చు 100 కోట్లు దాటుతుందని అంచనా అట.
అది కూడా ఈ పూర్తి ఖర్చు బన్నీ సేవింగ్స్ నుండే పెట్టుకోబోతున్నాడట. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కి ఈ సినిమా విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటికే ఒక పాట విడుదల చేసి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. సంక్రాంతి బరిలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తో ఈ సినిమా పోటీ పడబోతోంది.



