allu-arjun-arrestes-but-could-not-catch-rgv

పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో భాగంగా జరిగిన దుర్ఘటనకు భాద్యుడిగా చూపిస్తూ తెలంగాణ పోలీసులు పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ను సైతం అరెస్టు చేయగలిగారు.

కానీ దర్శకత్వం పేరుతో సమాజంలో గౌరవ ప్రద స్థానంలో ఉన్న వ్యక్తులను కించపరిచేలా సినిమాలు తీయడం, వారిని అగౌరవపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టడం చేసిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఏపీ పోలీసులు అరెస్టు చేయలేకపోయారు.

Also Read – సంక్రాంతి గేమ్ చేంజర్‌ వెంకటేషే… మళ్ళీ విక్టరీ!

దీనితో ఏపీ పోలీసుల చిత్త శుద్ధి ఏపాటిదో, ప్రభుత్వ పెద్దల మీద వారి గౌరవం ఏ స్థాయిలో ఉందో యిట్టె అర్ధమవుతుంది. అక్కడ సామాన్యుడికి జరిగిన నష్టానికి సైతం ఒక సెలబ్రెటీ ని దోషి గా నిలబెట్టగలిగితే, ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి సెలబ్రేటీలను సైతం మార్ఫింగ్ పోస్టులతో కించపరిచేలా చేసిన వ్యక్తిని కనీసం అరెస్టు కాదు కదా ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఏపీ పోలీసులు కనిపెట్టలేకపోయారు.

ఇది ఒక్క ఏపీ పోలీస్ వ్యవస్థకే కాదు కూటమి ప్రభుత్వానికి కూడా చెంపపెట్టువంటిది. కనీసం మంత్రిగా చేసిన అనుభవం కూడా లేని వ్యక్తి సీఎం గా ఒక పాపులర్ పాన్ ఇండియా స్టార్ హీరోను అరెస్టు చేయించగలిగితే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఏపీ ప్రభుత్వం పెద్దలు కనీసం వారికీ, వారి కుటుంబం సభ్యులకు జరిగిన అన్యాయానికి, అవమానాలకు కూడా న్యాయం చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు.

Also Read – ఇంతకీ కేజ్రీవాల్‌ మంచోడా కాదా?


ఒక కొడాలి నాని, వల్లభనేని వంశీ, శ్రీరెడ్డి, పోసాని కృష్ణ మురళి, రామ్ గోపాల్ వర్మ, రోజా ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి వైసీపీ ఉన్మాదుల లిస్ట్ పెద్ద చెంతాడంతా ఉంటుంది. వీరిలో ఏ ఒక్కరిని కూడా ఏపీ పోలీసులు అరెస్టు చేయలేకపోతున్నారు, అలాగే ఏపీ ప్రభుత్వం అటువంటి వారికి తగిన శిక్షలు వేసి భవిష్యత్ రాజకీయాన్ని సరిచెయ్యలేకపోతుంది. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తమ అలసత్వాన్ని వదిలిపెట్టాలి, అలాగే ఏపీ పోలీసులు ఇటువంటి వారికి బిర్యానీలతో మర్యాదలు కాకుండా చట్టబద్దమైన శిక్షలు విధించాలి.