పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించనని ధైర్యంగా బహిరంగంగా చెప్పిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల వర్మ – మీడియాల పరిణామాలతో పవన్ కళ్యాణ్ దరికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘నా పేరు సూర్య’ సక్సెస్ మీట్ లో పవన్ ప్రత్యక్షం అయ్యారు. ఇలా ఒకరికొకరు ఋణం తీర్చేసుకున్న తర్వాత పవన్ రాజకీయాలలో నిమగ్నమై పోయారు, బన్నీ ఏమో తన తదుపరి సినిమాల స్టోరీల కోసం ప్రయత్నిస్తున్నారు.
కానీ సడెన్ గా నేడు జనసేన ప్రచారంలో పవన్ కళ్యాణ్ పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు బన్నీ. “నీ నిజమైన పిచ్చిలో బ్రతుకు… ప్రపంచం అడ్జస్ట్ అవుతుంది…” అనే క్వోటేషన్ తో పవన్ పోస్టర్ ను పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యింది. ‘సూపర్ ఫోటో’ను పోస్ట్ చేసావంటూ బన్నీ సోదరుడు అల్లు శిరీష్ కూడా దీనిపై స్పందించారు. ఇలా ఒక్కసారిగా అల్లు సోదరులకు పవన్ కళ్యాణ్ ఎందుకు గుర్తుకు వచ్చారో? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇటీవల కాలంలో జనసేనకు మద్దతుగా మెగా హీరోలంతా సోషల్ మీడియాలో స్పందిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అయితే ఏకంగా బహిరంగంగానే మద్దతు పలికారు. బహుశా రేసులో వెనుకబడిపోతున్నానని భావించారో లేక జనసేన తరపున ప్రచారం చేయడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని పరోక్షంగా తెలపాలనుకున్నారో గానీ బన్నీ పోస్ట్ హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి అభిమానులు అడగకుండానే బన్నీ స్పందించడం ఫ్యాన్స్ కు సంతోషంగా మారింది.



