సుకుమార్ – అల్లు అర్జున్ కాంభినేషన్ లో ‘హ్యాట్రిక్’ మూవీగా వచ్చిన “పుష్ప”కు భారీ ఓపెనింగ్స్ తో ప్రేక్షకులు ఘనస్వాగతం పలికారు. సినిమాపై ప్రస్తుతం విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి గానీ, రెండు విషయాలలో మాత్రం ప్రేక్షకులందరి నుండి ఏకాభిప్రాయం వెలువడుతోంది. అందులో ఒకటి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ నటన, రెండవది ‘పుష్ప’ క్లైమాక్స్!
బహుశా సినిమా విజయాన్ని అంతా తన భుజస్కంధాల పైన వేసుకుని అల్లు అర్జున్ అలా అయిపోయారేమో అనిపించే విధంగా “పుష్ప” రాజ్ పాత్రకు ప్రాణం పోశారు. ఇది నిర్వివాదమైన అంశం. అయితే పుష్ప రాజ్ పాత్ర ఇక్కడితో ముగియడం లేదు కదా! ‘పుష్ప – ది రూలర్’ పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా సుకుమార్ ప్లాన్ చేసారు. సీక్వెల్ ఉందంటే సినిమా క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉండాలి?
ధియేటర్ నుండి బయటకు రాగానే నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా? అన్న టాక్ ప్రేక్షకుల నుండి వచ్చే విధంగా సినిమా క్లైమాక్స్ ఉండాలి. హాలీవుడ్ సినిమాలు రూపొందించేవారు ఇందులో సిద్ధహస్తులు. మనకు కూడా ‘బాహుబలి’ విషయంలో రాజమౌళి అద్భుతమైన క్లైమాక్స్ ఇచ్చి రెండవ పార్ట్ ను ఎనలేని క్రేజ్ ను తీసుకువచ్చారు. ఇక “కేజీఎఫ్” గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే!
2022లో ది మోస్ట్ అవైటెడ్ జాబితాలో ఇండియాలో నెంబర్ 1 స్థానాల్లో “కేజీఎఫ్ 2” ఉందంటే, ఈ సినిమా క్లైమాక్స్ ను ప్రశాంత్ నీల్ ఎలా డిజైన్ చేసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ప్రేక్షకులు ఓటీటీలలో ఒకటికి నాలుగైదు సార్లు ఈ సినిమాను చూసేసి ఉంటారు. కట్టుదిట్టమైన విలన్ అడ్డాలోనే విలన్ ను చంపే సీన్ తో ఎండ్ అయిన “కేజీఎఫ్” రేంజ్ క్లైమాక్స్ “పుష్ప”లో కొరవడిందనేది ప్రేక్షకుల మాట.
దీంతో “పుష్ప పార్ట్ 2″పై ప్రేక్షకుల ఆసక్తి లేకుండా పోయింది. సోషల్ మీడియాలో అయితే అసలు “పుష్ప 2” ఉంటుందో లేదో కూడా డౌట్ అన్న టాక్ కూడా వ్యక్తమవుతోంది. ఒక కూలీగా వచ్చి ఎర్రచందనం స్మగ్లర్ గా ఎదిగిన వైనం “కేజీఎఫ్” థీమ్ కు కాస్త దగ్గరగా ఉండడంతో సోషల్ మీడియా అంతటా కూడా కేజీఎఫ్ కు పుష్పకు నడుమ చర్చ జరుగుతోంది.
‘పుష్ప’ విడుదలకు కొద్దీ గంటల ముందు సుకుమార్ ను ఓ విలేఖరి ఇదే ప్రశ్న అడిగారు. ‘పుష్ప 2’ ఉన్న నేపథ్యంలో క్లైమాక్స్ ‘బాహుబలి, కేజీఎఫ్’ మాదిరి ఆసక్తిగా ఉంటుందా? అని అడుగగా, ‘అందులో ఏ మాత్రం సందేహం లేదు, పుష్ప చివరి 30 నిముషాలు పార్ట్ 2పై అంచనాలను పెంచుతాయి, మరింత ఆసక్తిని కలిగించేలా ఉంటుందని’ అన్నారు గానీ, అది సిల్వర్ స్క్రీన్ పై మాత్రం ఈ మాటలు పండలేదు.



