ఏ బిడ్డా… ఇది నా అడ్డా..!

ఏ బిడ్డా... ఇది నా అడ్డా..!రికార్డుల వేటకు “పుష్ప” గ్రౌండ్ క్లియర్ అయ్యిందా? దీనికి పూర్తి స్థాయిలో సమాధానం కావాలంటే మరో రెండు రోజుల లెక్కలు రావాల్సి ఉంటుంది. కానీ ఓపెనింగ్ డే మాత్రం అదిరిపోయే రికార్డులను “పుష్ప” సింగిల్ హ్యాండెడ్ గా కొల్లగొట్టడం టాలీవుడ్ కు శుభపరిణామం.

ఒక్క నైజాంలోనే తొలిరోజు 11 కోట్లకు పైగా షేర్ ను కొల్లగొట్టి అల్ టైం రికార్డును సొంతం చేసుకుంది. కరోనా తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు వస్తాయని టాలీవుడ్ ట్రేడ్ పండితులు కూడా అంచనా వేయలేకపోయారు. ఇండస్ట్రీకి అత్యంత కీలకమైన నైజాం మార్కెట్ లో ఈ ఓపెనింగ్స్ తదుపరి సినిమాలకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

ADVERTISEMENT

ఇక ఆంధ్రప్రదేశ్ లో తొలిరోజు మొత్తమ్మీద 13 కోట్ల వరకు షేర్ ను కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపుగా 24 కోట్లను సొంతం చేసుకుని గ్రాండ్ ఓపెనింగ్ ను అందుకుంది. ఏపీలో ఉన్న ప్రతికూల పరిస్థితులలో కూడా ఈ మాత్రం షేర్ ను అందుకోవడం మంచి విషయమే అయినా, ఏపీ సర్కార్ సహకారం ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మరో 3 నుండి 4 కోట్ల వరకు పెరిగి ఉండేదని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.

ఓవర్సీస్ కు వస్తే ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ డాలర్స్ సొంతం చేసుకున్న “పుష్ప” మొదటి రోజు కూడా అదే దూకుడును ప్రదర్శిస్తూ దాదాపుగా 1 మిలియన్ డాలర్స్ కు చేరువ అయ్యింది. యుఎస్ లో 2వ రోజుతో 1 మిలియన్ డాలర్స్ ను అందుకోవడం ఖాయం గానీ, బ్రేక్ ఈవెన్ కావాలంటే హీనపక్షంగా 2.50 మిలియన్ డాలర్స్ పైగా ‘పుష్ప’ కలెక్ట్ చేయాల్సి ఉంది.

తెలుగు పార్ట్ సంగతులు ఇలా ఉంటే పొరుగున ఉన్న తమిళనాడులో 4 కోట్ల వరకు ‘పుష్ప’ అందుకుందన్న వార్త చిత్ర యూనిట్ ను సంతోషంలో ముంచెత్తింది. అలాగే ఆలస్యంగా మొదలైన కన్నడ, మలయాళ భాషలలో కూడా ఓపెనింగ్ డే నాడు 1 కోటి రూపాయలు పైనే వసూలు అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

రిలీజ్ కు ముందు రోజు వరకు ముంబై వెళ్లని “పుష్ప”కు బాలీవుడ్ కూడా ఘనస్వాగతమే పలికింది. బాలీవుడ్ విశ్లేషకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ ఏకంగా 3 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఏ మాత్రం పబ్లిసిటీ లేకుండా ఈ స్థాయిలో కలెక్షన్స్ కుమ్మరించడం సాధారణ విషయం కాదు. ఈ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా ప్రకటించారు.

అయితే రెండవ రోజు నుండి “పుష్ప” కలెక్షన్స్ స్టడీగా ఉంటాయా? సినిమాపై వ్యక్తమవుతోన్న భిన్న స్పందనలను తట్టుకుని బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే దూకుడు మొదటి వారం ప్రదర్శితం అయితే, అనుకోని రికార్డులను “పుష్ప” అందుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories