తమ అభిమాన హీరోలను దేవుళ్ళతో పోల్చడం సగటు సినీ ప్రేక్షకులు ఎప్పుడూ చేసేదే. అయితే ఇటీవల కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హీరోలను దేవుళ్ళుగా కీర్తిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను తన దేవుడుగా బండ్ల గణేష్, రాంగోపాల్ వర్మ వంటి వారు కీర్తించగా, రెండు రోజుల క్రితం మహేష్ బాబు ‘స్పైడర్’ ఫస్ట్ లుక్ ఫోటోను కూడా వర్మ దేవుడిగా ఉన్నాడంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా అల్లు అర్జున్ కూడా దేవుడయ్యాడు. కెరీర్ లో తనకు తొలి అవకాశం కల్పించిన అల్లు అర్జున్ తన దృష్టిలో దేవుడంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ కీర్తించారు. “ఆర్య 2” సినిమాకు తనకు కొరియోగ్రాఫర్ గా మొదటి ఛాన్స్ ఇచ్చాడని, అప్పటి పరిస్థితుల్లో తన లాంటి కొత్తవారికి అవకాశం ఇవ్వడం సాధారణ విషయం కాదని, నిజానికి అప్పట్లో తమిళ కొరియోగ్రాఫర్లే కంపోజ్ చేసేవారని బన్నీ గురించి చెప్పుకొచ్చారు.
అందుకే తొలి అవకాశం కల్పించిన బన్నీ, తనకు ఎప్పటికీ దేవుడితో సమానమని అభిప్రాయపడ్డాడు. దీంతో రఘు మాస్టర్ ద్వారా అల్లు అర్జున్ కూడా ‘దేవుడు’ పోస్ట్ లోకి వచ్చేశారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘ఆర్య 2’ సినిమా కమర్షియల్ గా పెద్దగా ప్రజాధరణ పొందనప్పటికీ, ఆ సినిమాలోని పాటలు ఆడియో అండ్ వీడియో పరంగా కొత్త ట్రెండ్ ను సృష్టించిన మాట వాస్తవమే.



