ఎవరి జోలికి పోని అల్లు అర్జున్‌ని రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయించారు? అరెస్ట్ వెనుక అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నకు ‘అభద్రతాభావమే’ అని కేటీఆర్ జవాబు ఆలోచింపజేస్తుంది. అయితే సినీ నటుడైన అల్లు అర్జున్‌తో సిఎం రేవంత్ రెడ్డికి అభద్రతాభావమా? నాన్సెన్స్… అనిపిస్తుంది.
కానీ అందరి కంటే ముందుగా కేటీఆరే స్పందించడం, అభద్రతాభావమని చెప్పడం కలిపి చూస్తే అసలు విషయం అర్దమవుతుంది.
కేసీఆర్, కేటీఆర్‌లను ఏదో ఓ కేసులో అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. ఆయా కేసులలో కమిటీలు, విచారణలు, నివేదికలు, అధికారులు, సాక్షులు అందరూ కేసీఆర్ వైపే వేలెత్తి చూపుతున్నాయి కూడా.
కానీ కేసీఆర్‌ని అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోవడం లేదని బీజేపి నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. కనుక కేసీఆర్‌ని టచ్ చేయలేకపోయినా కనీసం కేటీఆర్‌నైనా లోపల వేసి ధైర్యం నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి అనుకోవడం సహజమే.
అందుకే ఫార్ములా-1 రేసింగ్ కేసుని సిద్దం చేసుకున్నారు. గవర్నర్ అనుమతి లభించగానే కేటీఆర్‌ని లోపల వేస్తామని రేవంత్ రెడ్డి ముందే చెప్పారు. కానీ కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తే బిఆర్ఎస్ పార్టీ గోలగోల చేస్తుంది. ఇటువంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న కేసీఆర్ బోనులో పులిలా ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడే ప్రమాదం ఉంటుంది.
బిఆర్ఎస్ పార్టీ చేసే హదావూడితో కేసీఆర్, కేటీఆర్‌లకు ప్రజల సానుభూతి, రాజకీయ మైలేజ్ లభిస్తుంది. అదే కనుక జరిగితే జగన్‌లాగ రేవంత్ రెడ్డి కూడా దెబ్బయిపోయే ప్రమాదం ఉంటుంది.
కనుక తమ ప్రజాప్రభుత్వం నేరం చేసినవారు ఎంత పెద్దవారైనా ఉపేక్షించదని సిఎం రేవంత్ రెడ్డి రెండు మూడు రోజుల ముందే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు కూడా. అది నిరూపించుకోవడానికే అల్లు అర్జున్‌తో ఈ ట్రయల్ రన్ నిర్వహించి ఉండొచ్చు.
ఆనాడు సంజయ్ దత్, సల్మాన్ ఖాన్‌లను మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయలేదా?మరి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేస్తే ఎందుకు ఉలికిపాటు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు అల్లు అర్జున్ అంతటివాడిని అరెస్ట్ చేయగా లేనిది అవినీతికి పాల్పడిన కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తే తప్పా? అని రేవంత్ రెడ్డి ఆడకుండా ఉండరు.
అంటే కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ తక్కువగా చేసేందుకు, జనాలు ఎక్కువగా రియాక్ట్ కాకుండా చేసేందుకే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసిన్నట్లు భావించవచ్చు.
తనని అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారని కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్‌ని ‘అభద్రతాభావం’ అని క్లుప్తంగా చెప్పారనుకోవచ్చు.
కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు సమాచారం. కనుక నేడో రేపో తెలంగాణ ఏసీబీ అధికారులు కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు పిలిచి అరెస్ట్ చేయవచ్చు. దానికి ముందస్తు సన్నాహమే అల్లు అర్జున్ అయ్యుండవచ్చు. అవునో కాదో త్వరలోనే తెలుస్తుంది.
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును.. చేసిన అతిని ఖండిస్తున్నాను : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతాభావానికి తార్కాణం
తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి… https://t.co/zwzxhPr4AS
— BRS Party (@BRSparty) December 13, 2024




