అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ఎడాపెడా సుంకాలు విధించడంతో అమెరికాతో సహా ప్రపంచదేశాల మార్కెట్లు నష్టపోతున్నాయి. వివిద దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే లక్షలాది ఉత్పత్తులు, వాటిని ఉత్పత్తి చేసే సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ట్రంప్ దెబ్బలకు భారత్ కూడా మినహాయింపు కాదు కనుక వివిద రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
సుంకాలు పెంపుతో అమెరికాకు ఆదాయం పెరుగుతుందని, ఆమెరికన్ల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని కనుక ప్రపంచదేశాల దోపిడీ నుంచి అమెరికాకు, ఆమెరికన్లకు లిబరేషన్ (విముక్తి) కల్పించనని డోనాల్డ్ ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు.
తన నిర్ణయం వలన అమెరికాతో సహా ప్రపంచ మార్కెట్స్ తీవ్రంగా నష్టపోతుంటే ఆ రోజంతా డోనాల్డ్ ట్రంప్ హాయిగా గోల్ఫ్ ఆడుకున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేయడమే కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా చాలా నిర్లక్ష్యంగా ట్రంప్ వ్యవహరించారని ప్రపంచ దేశాలు ఆక్షేపిస్తున్నాయి. కానీ ఈ ఒడిదుడుకులు తాత్కాలికమే అని ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.
ఆయన చెప్పిన్నట్లుగానే ప్రపంచ మార్కెట్లు మళ్ళీ కోలుకోవడం ఖాయమే కానీ ఆయన నిర్ణయం వలన ఆవిరి అయిపోయిన సంపద తిరిగిరాదు కదా?
ట్రంప్ చెప్పుకొన్నట్లు ఆయన నిర్ణయం వలన కనీసం అమెరికా, ఆమెరికన్స్‌కి నిజంగా మేలు కలిగితే సంతోషమే. కానీ రొయ్యలు, మందులు వంటి అనేక దిగుమతులు తగ్గిపోతే మొదట ఇబ్బందిపడేది ఆమెరికన్లే కదా?
అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ ధరకు లభించే ఐటి సేవలపై ఈ ప్రభావం ఉంటుంది కనుక అవి తగ్గితే అమెరికాలో కంపెనీలకు నష్టమే కదా?
ట్రంప్ నిర్ణయం అమెరికాకు మేలు చేస్తుందా లేక ఇబ్బందులకు గురి చేస్తుందా?అనేది ఎలాగూ రాబోయే రోజుల్లో కనిపిస్తుంది.
కానీ ఈ గ్లోబలైజేషన్ రోజుల్లో కూడా ఏ దేశమూ మరో దేశంపై అతిగా ఆధారపడకూడదనే గుణపాఠం ట్రంప్ నేర్పారని గ్రహించడం చాలా అవసరం. అమెరికాపై అతిగా ఆధారపడితే ఏమవుతుందో ట్రంప్ ఆచరణలో రుచి చూపించారు.
కనుక ప్రపంచదేశాల సంగతి ఎలా ఉన్నా ముందుగా భారత్ అమెరికాపై ఆధారపడటం తగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయాల్సిన సమయం ఇదే.
గతంలో అంతరిక్ష ప్రయోగాలు, క్రయోజెనిక్ ఇంజన్, అత్యాధునిక యుద్ధ విమానాలు, అణ్వాయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం కోసం భారత్ ఇతర దేశాల మీద ఆధార పడాల్సివచ్చేది. కానీ అప్పుడు అగ్రరాజ్యాలు సహాయ నిరాకరణ వలన భారత్ స్వయంగా ఇవన్నీ తయారు చేసుకోగలిగింది. అంటే అవసరం అన్నీ నేర్పించిందన్న మాట!
ఇప్పుడు దిగుమతుల విషయంలో కూడా అమెరికా అదే విదంగా వ్యవహరిస్తోంది కనుక దీనినే ఓ గుణపాఠంగా, ఓ అవకాశంగా స్వీకరించి, అమెరికాపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఏమేమి ప్రత్యామ్నాయ మార్గాలున్నాయో కనుగొనడం అవసరం.
ప్రపంచంలో 145 కోట్లకు పైగా వినియోగదారులున్న అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ని అన్ని దేశాలు గుర్తించి, భారత్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు, స్వయంగా భారత్ ఈ అతిపెద్ద మార్కెట్‌ని వినియోగించుకొని లాభపడవచ్చు కదా?
ప్రపంచదేశాల నుంచి అమెరికాకు విముక్తి లభిస్తుందని ట్రంప్ చెప్పుకున్నట్లే భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు కూడా అమెరికన్ బానిసత్వం నుంచి విముక్తి అవసరమే.




