ఎస్ఐఆర్ పేరుతో దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల కమీషన్ కలిసి నిర్వహిస్తున్నయా? అంటే కాదనే తెలుసు. ఎక్కడికక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాధికారులు, సిబ్బందే ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రక్రియలో అవకతవకలు జరుగకుండా జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ తమ నేతలు, కార్యకర్తలకు, లేదా ప్రతినిధులకు బాధ్యత అప్పగించాయి. వారి పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ జరిగినప్పటికీ, ఇప్పుడు అందరూ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను, ప్రధాని మోడీని నిందిస్తున్నారు.
‘ఓట్ చోరీ’ అంటూ రాహుల్ గాంధీ మొదలు పెట్టిన వాదనలను కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బాగానే వ్యాపింపజేసింది. కానీ ఇలాంటి సమస్య ఏర్పడుతుందని ముందే ఊహించి ఉంటే ఈ ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడేది.
కానీ ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియ నిర్వహించడం పశ్చిమ బెంగాల్ వంటి కీలకమైన రాష్ట్రంలో బిజేపి అధికారంలోకి రావడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
అయితే కాంగ్రెస్, మిత్రపక్షాలు చేస్తున్న ఆరోపణలను బిజేపి, మోడీ ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కొంతున్నాయే తప్ప వాటి ఆరోపణలు తప్పని నిరూపించేందుకు గట్టి ప్రయత్నాలు చేయకపోవడం కూడా వాటి వాదనలు నిజమని దేశ ప్రజలు భావించేలా చేస్తోంది.
ఈ విషయంలో తెలంగాణ బిజేపి ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సహేతుక వాదనలు చేశారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఒక్క మహేశ్వరంలోనే సుమారు 30,000 మంది రోహ్యింగాలున్నారు. వారి వలన నష్టపోయేది మన భారతీయ పౌరులే కదా?” అని ప్రశ్నించారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాల నుంచి అక్రమంగా వలసలు వచ్చి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో, నగరాలు, చిన్న చిన్న పట్టణాలలో స్థిరపడినవారి సంఖ్య లక్షలలో ఉంటుందని ఓ అంచనా. వారిలో చాలా మందికి స్థానిక పార్టీలు, నేతలు ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు ఏర్పాటు చేశారు.
దేశ జనాభా ఇప్పటికే 140 కోట్లు దాటిపోయింది. ఓ పక్క నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంటే, మరోపక్క ఏఐ వలన వేలాదిమంది ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడుతున్నారు.
ఇవి సరిపోవన్నట్లు ఓ పక్క నిరంతరంగా సాగుతున్న యుద్ధాల వలన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, వాటితో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి.
మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ఇలాంటి విపరీత పరిస్థితులలో దేశంపై ఎల్‌నినో విరుచుకు పడటంతో నిత్యావసర సరుకుల ధరలు ఇంకా పెరిగిపోయాయి.
దేశం ఇన్ని సమస్యలతో సతమతమవుతుంటే రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంక్ సృష్టించుకోవడం కోసం ఈవిధంగా విదేశీయులకు అక్రమంగా ఆశ్రయం కల్పిస్తే ఏమవుతుంది? అటువంటివారిని ‘సర్’ పేరుతో ఏరివేస్తుంటే ఆయా పార్టీల ఓటు బ్యాంకు దెబ్బ తింటుంది. కనుక ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతోందంటూ ఆందోళనలు చేస్తున్నాయి.
వాటి పోరాటం నిజంగా ప్రజాస్వామ్యం కాపాడుకోవడం కోసమే అయితే, దేశంలో అక్రమంగా స్థిరపడిన విదేశీయుల ఏరివేతలో కేంద్రానికి, ఈసీకి సహకరించాలి. కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి?





