కనక వర్షం కురిపించే లేలేత యవ్వనపు ప్రేమకథలు

Baby Movieఇటీవలే ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు విపరీతమైన ప్రమోషన్లు చేస్తే రిలీజ్ రోజు పట్టుమని కోటి రూపాయల షేర్ రాలేదు. కానీ బేబీ ఏకంగా మూడున్నర కోట్లు దాటేయడం చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయింది. కంటెంట్ మీద యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు. పాజిటివ్ నెగటివ్ రెండూ కనిపించాయి. యూత్ అవన్నీ పట్టించుకోవడం లేదు. తాము కోరుకున్నది ఉందని తెలుసుకుని థియేటర్లకు వెళ్తున్నారు.

ఇప్పుడే కాదు కనెక్ట్ అయ్యేలా చూపిస్తే టెండర్ ప్రేమ కథలు ఎప్పుడైనా బంగారమే. బ్లాక్ అండ్ వైట్ జామానా వద్దు కానీ కలర్ రోజుల్లో వచ్చి క్లాసిక్స్ గా నిలిచిపోయిన వాటిని అర్థం చేసుకుంటే వాస్తవం అవగతమవుతుంది. భారతీరాజా సీతాకోకచిలుక(1981)లో ఇంకా మీసాలే రాని ఓ నవ యవ్వనపు కుర్రాడికి, అప్పుడప్పుడే వయసు మొగ్గ తొడుగుతున్న క్రిస్టియన్ అమ్మాయికి మధ్య లవ్ ని ప్రెజెంట్ చేసిన తీరు గొప్ప విజయాన్ని అందించింది. ఇళయరాజా సంగీతం వెన్నెముకగా నిలిచింది.

ADVERTISEMENT

టి రాజేంద్ర ప్రేమ సాగరం(1983) అప్పట్లో ఊపేసిన చిత్రమే. వంద రోజులు దాటేసి ఆడింది. పాటలు సంవత్సరాల తరబడి రేడియోలో, క్యాసెట్లలో హోరెత్తిపోయాయి. దర్శకుడు తేజ డెబ్యూ మూవీ చిత్రం(2000) మీద ఉషాకిరణ్ సంస్థ పెట్టిన పెట్టుబడి కోటి లోపే. కానీ అంతకు పదింతలు వసూలు చేసి పెట్టింది. టెన్త్ క్లాస్(2006) టైటిల్ తో రొమాన్స్ చూపిస్తే స్కూళ్ళు కాలేజీలు ఎగ్గొట్టి థియేటర్ల దగ్గర క్యూ కట్టారు.

గౌతమ్ మీనన్ ఏ మాయ చేసావే(2010)లో నటించే నాటికి నాగచైతన్య సమంతాలు నూనూగు వయసులోనే ఉన్నారు. నువ్వు నేను(2006)లో చూపించింది కాలేజీ తొలి మోహపు వలపు పాఠాలు, ఆపై తల్లితండ్రులతో సంఘర్షణ. బాలచందర్ మరో చరిత్ర(1978) విషాదంతో ముగించినా యవ్వనపు ఆకర్షణ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి.

నువ్వే కావాలి(2000) చరిత్ర గురించి రాస్తే పుస్తకాలు చాలవు. ఇక్కడ చెప్పిన ఏ సినిమాలోనూ స్టార్లు ఉండరు. దాదాపుగా కొత్త మొహాలతో తీసినవే. ఒకటి రెండు మినహాయించి బడ్జెట్లు రెండు మూడు కోట్లు దాటనివే. కానీ రూపాయికి పది నుంచి ఇరవై రూపాయలు లాభాలు తీసుకొచ్చినవి. బేబీ వీటి సరసన నిలుస్తుందో లేదో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది కానీ కొంత వెయిట్ చేయాలి.

కుర్రకారుని లక్ష్యంగా పెట్టుకుంటే కాలంతో సంబంధం లేకుండా టెక్నాలజీతో నిమిత్తం లేకుండా ఎలా కనకవర్షం కురుస్తుందో వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కోట్ల బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్, డేట్లు ఇవ్వని బడా స్టార్లు, పెద్ద ప్రొడ్యూసర్లు ఇవేవి లేకపోయినా సరే స్క్రీన్ మీద మేజిక్ చేస్తే చాలు హిట్టు కొట్టొచ్చనే నమ్మకాన్ని కలిగించినవే. కాకపోతే స్ఫూర్తి తీసుకుంటే సరిపోదు దానికి సరిపడా సృజనాత్మకత ఉండాలి.

ADVERTISEMENT
Latest Stories