ఈ జేబులో డబ్బు ఆ జేబులో పెట్టుకున్నా మనదేగా?

TDP-Jana Sena: New Entrants Spark Local Election Seat Disputes

కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఆలోచన చేస్తున్నప్పుడే చిన్న శ్రీనుతో సహా పలువురు టీడీపిలో చేరారు. అదేవిధంగా జనసేనలో కూడా చేరారు.

ప్రభుత్వం రిజర్వేషన్స్ ప్రకటించగానే మరికొందరు చేరారు. కూటమి పార్టీల మద్య సీట్ల సర్దుబాట్లు అవుతున్నప్పుడు మరికొంత మంది హడావుడిగా చేరి కండువాలు వేయించుకున్నారు.

ADVERTISEMENT

ఈ చేరికలన్నీ పదవుల కోసమేనని వేరే చెప్పక్కరలేదు. చివరి నిమిషంలో పార్టీ చేరి ‘మమ’ అనిపించుకొని సీట్లు దక్కించుకోవడంపై ఓ నెటిజన్ చాలా ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు.

ఏదో సినిమాలో హీరోయిన్‌ అవసరానికి హీరో కృష్ణ డబ్బులు ఇస్తూ, “నీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటా? నీకు డబ్బులు ఇచ్చానంటే ఈ జేబులో నుంచి తీసి ఆ జేబులో పెట్టుకున్నట్లు,” అని అంటాడు.

“అలాగే అభ్యర్ధి టీడీపిలో ఉంటే ఒకటి, జనసేనలో ఉంటే ఒకటా?” అని కామెంట్ చేశారు.

ఉదాహరణకు విజయవాడ కోసం జనసేన మంకు పట్టు పట్టి దక్కించుకుంది. అప్పుడు వంగవీటి రాధాకృష్ణ హడావుడిగా జనసేనలో చేరి ఆ సీటు దక్కించుకున్నట్లు టాక్!

ఇదేవిధంగా తుని మున్సిపాలిటీని జనసేనకు కేటాయించడంతో ఆ ఛైర్‌ పర్సన్ పదవి ఆశిస్తున్న టీడీపి నేత మళ్ళ గణేష్ దంపతులు జనసేనలో చేరిపోయారు. మళ్ళ మీనాక్షిని తుని మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటించిన జనసేన. ఇంతకీ ఈ సీటు జనసేనకు దక్కినట్లా లేక టీడీపికా?అంటే పైన పేర్కొన్న సినిమా డైలాగ్ గుర్తుచేసుకోవాల్సిందే.

ఇలాంటి ప్యారాచూట్ నేతలు హటాత్తుగా వచ్చి సీట్లు ఎత్తుకు పోతుండటంతో ఇంతకాలం జనసేన కోసం శ్రమించిన నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే విజయనగరం టీడీపి నేతలు, కార్యకర్తలకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది.

విజయనగరం మేయర్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో ఇటీవల పార్టీలో చేరిన చిన్న శ్రీను, తన కుమార్తె కుమార్తె సిరి సహస్రకు ఆ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ పదవిపై ఆశ పెట్టుకున్న స్థానిక టీడీపి నేతలు, వారి అనుచరులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటి పెట్టుకొని పని చేసిన తమని కాదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి కీలక పదవులు ఇస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నారు. కానీ ఈ హామీతోనే పార్టీలో చేరామని చిన్న శ్రీను వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

కూతురు జీవితం బాగుండాలనే తల్లితండ్రులు మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తుంటారు. కానీ కొత్త అల్లుడికి కూడా కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా?అలాగని కొత్త అల్లుడి కోసం కోటను అప్పగించేయలేరు కదా? జనసేన నేతలు, కార్యకర్తలు కూడా సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారేమో కదా?

ADVERTISEMENT
Latest Stories