మహేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ నవంబర్ 27న విడుదలవుతోంది. 1970-80లలో సినిమా హీరోల అభిమానులు ఏవిదంగా వ్యవహరించేవారో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. కానీ సినిమా టైటిల్, హీరో విషయంలో అందరికీ రెండు సందేహాలున్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ‘ఆంధ్రా’ అంటే అదేదో బూతు పదం అన్నట్లు మార్చేశారు. ఓ పక్క ఆంధ్రాని ద్వేషిస్తూనే, ఆంధ్రా పేరుతోనే రాజకీయ లబ్ది పొందుతున్నారు. కనుక ఈ సినిమాకి ‘ఆంధ్రా’ కింగ్ తాలూకా’ అని పేరు పెడితే తెలంగాణలో ఆడుతుందా లేదా? తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా లేదా? అనే ప్రశ్నకు సినిమా విడుదలైతే సమాధానం లభిస్తుంది.
ఇక ‘ఆంధ్రా కింగ్’ అని సినిమాకి పేరు పెట్టినప్పుడు తెలుగు హీరోలలో ఎవరో ఒకరిని‘ఆంధ్రా కింగ్’గా చూపవచ్చు కదా? కానీ కన్నడ నటుడు ఉపేంద్ర ఎందుకు? అంటే దర్శకుడు మహేష్ బాపు, ఈ సినిమాని తెలుగుతో పాటు కన్నడ భాషలో కూడా విడుదల చేస్తున్నందున, మూడు రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఉపేంద్రని ఎంచుకున్నామని చెప్పారు. ఆయన లాజిక్ కరెక్టే!
కానీ ఆ తర్వాత చెప్పిన మరో మాట తెలుగు సినీ అభిమానులకు ఆగ్రహం కలిగిస్తోంది. ‘ఉపేంద్రకు మాత్రమే’ మూడు రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉందని మిగిలిన హీరోలు ఆయా రాష్ట్రాలకే పరిమితమని మహేష్ బాపు అన్నారు.
తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, అలాగే తమిళంలో కమల్ హాసన్ హాసన్, రజినీకాంత్, మలయాళంలో మామ్ముట్టి, సుకుమారన్, దుల్కర్ సల్మాన్ లాంటి పలువురికి దక్షిణాది రాష్ట్రాలలోనే కాదు.. యావత్ దేశంలో… ఆ మాటకొస్తే పలు దేశాలలో కూడా అభిమానులున్నారు.
కానీ వారు ఇటువంటి చిన్న సినిమాలకి లభించరు. ఒకవేళ లభించినా వారి పారితోషికాలు భరించడం చిన్న నిర్మాతలకు కాదు. కిరణ్ అబ్బవరం, విశ్వక్ సేన్, జొన్నలగడ్డ సిద్ధూ, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి వంటి అనేకమంది తెలుగు నటులున్నారు.
కానీ మహేష్ బాపు చెప్పినట్లుగా వారిలో చాలా మంది ఏపీ, తెలంగాణలకు మాత్రమే పరిమితమై ఉన్నారు. పైగా అందరూ బిజీగా ఉన్నారు. కనుక మధ్యే మార్గంగా ఉపేంద్రని ఎంచుకొని ఉండవచ్చు. తద్వారా ఏపీ, కర్ణాటక రాష్ట్రాలలో తప్పకుండా హిట్ కొట్టవచ్చని భావింఛి ఉండవచ్చు.
మహానటిలో సావిత్రి పాత్రకి మళయాళ సినీ పరిశ్రమకు చెందిన కీర్తి సురేష్, జెమినీ గణేశ్ పాత్రకి దుల్కర్ సల్మాన్‌ని తీసుకొన్నప్పుడు, ఆంధ్రా కింగ్ పాత్రకు ఉపేంద్రని తీసుకోవడం కూడా తప్పు కాదు.
కానీ ఆంద్ర కింగ్, తెలంగాణ, తమిళ, కన్నడ ప్రజలను మెప్పించగలరా లేదా అనేదే ముఖ్యం. మెప్పించగలరో లేదో నవంబర్ 27న సినిమా విడుదలైనప్పుడు తెలుస్తుంది.





