హైకోర్టులో ప్రభుత్వానికి మళ్ళీ మొట్టికాయలు… అయినా సిగ్గేలే!

Andhra_Pradesh_High_Courtఅమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతించినప్పటికీ ఐడీ కార్డులు లేవనే సాకుతో వారిని పోలీసులు అడ్డుకొంటుండంతో వేసారిపోయిన రైతులు మళ్ళీ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి పాదయాత్రను అనుమతించరాదంటూ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ రెండు పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ మొట్టికాయలు వేసింది.

గతంలో తాము సూచించిన విదంగా రైతులు పాదయాత్ర చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రైతుల తరపు వాదనలు వినిపించిన న్యాయవాదులు ఐడీ కార్డులు లేవనే సాకుతో పోలీసులు రైతులను అడ్డుకొంటున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా వారికి పోలీసులే ఐడీ కార్డులు ఇస్తే మంచిదే అని కానీ ఒకవేళ ఇవ్వకపోతే రైతులు ఏ రకమైన గుర్తింపు కార్డు కలిగి ఉన్నా సరిపోతుందని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

రైతులకు స్థానిక ప్రజలు ఏ రూపంగానైనా సంఘీభావం తెలుపవచ్చని అందుకు పోలీసులు అభ్యంతరం చెప్పరాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పాదయాత్రలో కేవలం 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని ఇతరులు ఎవరూ పాల్గొనరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ రైతులు ఈ నిబందనలు ఉల్లంఘించినా లేదా పోలీసులే ఉల్లంఘించినా మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.

అసలు అమరావతి రైతుల పాదయాత్రను ప్రభుత్వం, పోలీసులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకొనేందుకు ప్రయత్నించడం వలననే వారి పాదయాత్రకు ఆశించినడాని కంటే ఎక్కువ గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. వారిని అడ్డుకొనే సాకుతో ఎక్కడికక్కడ ప్రజలలో సెంటిమెంట్ రగిలించి తమవైపు ఆకర్షించుకొందామని వైసీపీ నేతలు భావిస్తే, ప్రజలకు రైతుల మీద సానుభూతి పెరుగుతోంది. రైతులతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు వ్యవహరిస్తున్న తీరును ప్రతీ ఒక్కరూ తప్పుపడుతున్నారు.

రైతుల పాదయాత్రను విజయవంతంగా అడ్డుకొన్నామని బొత్స సత్యనారాయణ వంటివారు భుజాలు చరుచుకొనేలోగానే హైకోర్టు మళ్ళీ వారిని పాదయాత్రకు అనుమతించడమే కాక ఈసారి సాధారణ గుర్తింపు కార్డులు ఉన్నా సరిపోతుందని చెప్పడం వైసీపీ నేతలకు చెంప దెబ్బ వంటిదే.

అయితే వైసీపీ ఆత్మసాక్షి “అమరావతి రైతులకు హైకోర్టులో చుక్కెదురు” అంటూ రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందని, ఇదివరకు పేర్కొన్న షరతుల ప్రకారమే పాదయాత్ర చేసుకోవాలని హైకోర్టు రైతులను ఆదేశించిందని వ్రాసుకోవడం చూస్తే సిగ్గేలే… అనిపించకమానదు.

ADVERTISEMENT
Latest Stories