రెండు పార్టీలకు రెండు స్థానిక దెబ్బలు.. అవసరమా?

AP High Court Verdict on BC Quota, Local Body Polls

నేడు ఏపీ హైకోర్టులో కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి ఎదురు దెబ్బలు తగిలాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వాటిని రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

అలాగే సర్ ప్రక్రియ ముగిసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించరాదంటూ వైసీపీ వేసిన పిటిషన్‌ని కూడా హైకోర్టు కొట్టివేసింది. ఆరు వారాలలోపు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది.

ADVERTISEMENT

కనుక బీసీ రిజర్వేషన్స్ విషయంలో ప్రభుత్వానికి, సర్ ప్రక్రియ పేరుతో ఈ ఎన్నికలు అడ్డుకోవాలని ప్రయత్నించిన వైసీపీకి హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలాయి.

ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేస్తుందని, ఆ వంకతో ఎన్నికలు నిర్వహించకుండా చంద్రబాబు నాయుడు తాత్సారం చేస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు.

ఎన్నికల నిర్వహణలో చంద్రబాబు నాయుడుకు అటువంటి ఆలోచన లేనప్పటికీ, బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఇలాగే జరుగుతుందని తెలిసి ఉన్నా జీవోలు జారీ చేయడం, అవి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ హైకోర్టు కొట్టివేసినా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకోవడం, అక్కడ కూడా భంగపడటం అవసరమా? అనిపిస్తుంది.

ఈ ఎన్నికలలో బీసీలను మెప్పించేందుకు తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయంతో ఆశించిన ఫలితం లభిస్తుందో లేదో తెలీదు. కానీ హైకోర్టులో పిటి వేసి స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలని ప్రయత్నించిన వైసీపీయే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించగలుగుతుంది. కూటమి ప్రభుత్వమే దానికి చేజేతులా ఈ అవకాశం కల్పించడం అవసరమా?

అయినా ‘మా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు, బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందని’ చెప్పుకోవడం కోసం కోర్టులలో ఎదురు దెబ్బలు తినాల్సిన అవసరం ఉందా? రాష్ట్రంలో బీసీలు ఈమాత్రం రాజకీయాలు అర్థం చేసుకోలేరని అధికార, ప్రతిపక్షాలు ఎలా భావిస్తున్నాయో?

రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్ళినా, ఆరు వారాలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనే హైకోర్టు తీర్పు శిలాశాసనమే అవుతుంది. అదొక్కటే ఊరట!

ADVERTISEMENT
Latest Stories