ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్దమవుతుంది. ఇప్పటికే మేయర్, చైర్ పర్సన్స్, జడ్పీటీసీ, ఎంపీటీసీ సంస్థల ఎన్నికల్లో కూటమి ఏకచక్రాధిపత్యం కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు రాష్ట్రంలో పంచాయితీల పోరుకి సైరన్ మోగనుంది.
అయితే ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికల మాదిరి పార్టీ జెండాలు ఉండవు, కానీ పార్టీ అజెండాలు పనిచేస్తాయి. అలాగే పార్టీల గుర్తులు కనిపించవు కానీ పార్టీ గుర్తింపు కనిపిస్తుంది. నాయకుల ప్రచారం కాదు నేతల పనితనం ప్రధానపాత్ర పోషిస్తుంది.
ఈ తరుణంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ కంటే ఏకాభిప్రాయానికే పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. గ్రామాల్లో ఎన్నికల ఖర్చులు, రాజకీయ విభేదాలు, వర్గపోరాటాలకు స్వస్తి పలికి.. అందరూ కలిసి ఏకగ్రీవంగా నాయకత్వాన్ని ఎన్నుకునేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన భారీగా ప్రోత్సాహకాలు అందించనున్నారు. 5 వేల వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం అందించే ప్రతిపాదనను ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది.
ఈ ప్రోత్సాహకాలు అమలైతే గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలకు మరింత ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తలెత్తే రాజకీయ ఘర్షణలు, వ్యక్తిగత విభేదాలు తగ్గడంతో పాటు గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చుకునే అవకాశం కూడా ఉంటుంది.
మరి కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఏకగ్రీవాల నిధుల పంచాయితీకి మద్దతుగా గ్రామ ప్రజలు ముందుకొస్తారా.? ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తారా.? అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన నిధులు ఆయా పంచాయితీలకు చేరాలంటే సర్పంచ్ తో సహా వార్డ్ నెంబర్లు అందరు ఏకగ్రీవాలుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది.






