ఒకప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే చాలు… ఆ తర్వాత పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తి సమయం కేటాయించి పనిచేయగలిగేవి. అప్పుడూ చాలా రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, రాజకీయాలు మరీ ఇంతగా దిగజారి పోలేదు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విధి విధానాలు, ప్రజా సమస్యలపైనే విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతూ ఉండేవి.
కానీ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల కుట్రలను నిశితంగా గమనిస్తూ ఉండాలి. అలాగే ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు బలంగా తిప్పికొడుతూ ఉండాలి.
అవినీతి కేసులు, అక్రమాలు, భూకబ్జాలు, న్యాయపోరాటాలు వంటివన్నీ రాజకీయ వ్యవస్థలో భాగమైపోయాయి. కనుక రాజకీయాలలో ఉన్నవారందరూ వీటన్నిటినీ భరిస్తూ లేదా తప్పించుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది.
ఒకవేళ అధికారంలో ఉంటే, ఈ కుట్రలు, దుష్ప్రచారం అన్నిటినీ ఓ కంటితో గమనిస్తూనే సమర్థంగా పాలన సాగించాలి. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అలాగని సంక్షేమ పథకాలు ఆపడానికి లేదు. ఇక ఎన్నికల హామీల భారం ఉండనే ఉంటుంది. వీటన్నిటికీ నిధులు సమకూర్చుకోవడం మరో పెద్ద పని.
విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో మీడియా ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెపుతూ, “ఇది వరకు కేవలం పాలన, అభివృద్ధి గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడిని. దాని వలన రాజకీయంగా ఎదురు దెబ్బలు తిన్నాను.
అప్పటి నుంచి పాలన, అభివృద్ధితో పాటు రాజకీయాలపై కూడా దృష్టి పెట్టి, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. కనుక ఈసారి ఎటువంటి సమస్యలు ఉండవనే భావిస్తున్నాను,” అని చెప్పారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నందుకే కూటమి ఐక్యత బలంగా ఉంది. కేంద్రంతో సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. వైసీపీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవడానికి కారణం కూడా ఇదే… కదా?
అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి బ్యాలెన్సింగ్ చాలా అవసరమే. బ్యాలెన్స్ తప్పినందుకు గతంలో చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు… కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, ఇంకా చాలా మంది హేమాహేమీలు ఎదురుదెబ్బలు తిన్నారు. అయితే వాటితో ఈ విధంగా గుణపాఠాలు నేర్చుకున్న వారు ఎందరు?






