అధికారానికి దూరమైన ప్రతి సారి రాజకీయ పార్టీల అధినేతలు, వారి వారసులు రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలకు శ్రీకారం చుట్టడం తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో మొదలైన ఈ సంస్కృతీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కొనసాగించారు.
ఇక వైఎస్ రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్ వైసీపీ ని అధికారంలోకి తెచ్చేందుకు పాదయాత్రకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక అన్న వదిలిన బాణంగా రాజకీయ అరంగేట్రం చేసిన వైఎస్ షర్మిల సైతం ఇటు పుట్టిల్లు ఏపీలో అటు అత్తారిల్లు తెలంగాణలో పాదయాత్రలు చేసింది.
అయితే 2019 వైఎస్ జగన్ పాదయాత్ర వైసీపీ ని అధికారంలోకి తెచ్చినట్టే, 2023 లోకేష్ పాదయాత్ర టీడీపీ కి పట్టం కట్టింది. అలాగే అటు తెలంగాణలో సైతం రేవంత్ రెడ్డి పాదయాత్ర పదేళ్ల కాంగ్రెస్ పార్టీ నిరీక్షణకు ముగింపు పలికింది. ఇలా పాదయాత్రలు సినిమా ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాదిరి మారిపోతున్నాయి.
ఒక చిత్రం విడుదలకు ముందు ఆ చిత్ర యూనిట్ తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహిస్తాయి. మా సినిమాలో యాక్షన్ ఉంది, సెంటిమెంట్ డ్రామా ఉంది, అలరించే పాటలున్నాయి అంటూ తమ సినిమాకు వస్తే ప్రేక్షుడికి వినోదం ఉంటుందంటూ తమ మూవీని ప్రమోట్ చేసుకుంటారు.
సరిగ్గా అలాగే ఒక రాజకీయ పార్టీ అధినేత కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, అధికారంలోకి వస్తే మేం మీకు ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ హామీలిచ్చి ప్రజలను తమ పార్టీ ఓటర్లుగా మలచుకుంటున్నారు, పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటున్నారు.
మొత్తానికి ఈ పాదయాత్రలు ప్రతిపక్ష పార్టీలకు అధికారాన్ని అందించే ఒక జీవామృతంలా మారిపోతున్నాయి. ఏపీలో వైసీపీ తెలంగాణలో బిఆర్ఎస్ ఎన్నికలకు ముందు పాదయాత్రలకు ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోఎడాదిన్నర లో పాదయాత్రలతో ప్రజలముందుకొస్తాను అంటూ పలుమార్లు ప్రకటించేసారు.
ఇక తెలంగాణలో కూడా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నికల ముందు పాదయాత్రకు శ్రీకారం చుడతానని, తద్వారా రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుంటానని తమ పార్టీ క్యాడెర్ కి ఒక భరోసా ఇచ్చారు.
ఇలా పాదయాత్రలు అధికారానికి ముందు జరుపుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్ల మాదిరి మారిపోతున్నాయి. మరి ఈ సారి కూడా వైఎస్ జగన్ పాదయాత్ర వైసీపీ కి కలిసొస్తుందా.? జగన్ 2.0 కళను నెరవేరుస్తుందా.? కేటీఆర్ పాదయాత్ర బిఆర్ఎస్ ను మూడోసారి అధికార పీఠం ఎక్కిస్తుందా.? మరోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తుందా.?




