రెండు జాతీయ పార్టీలకు ‘చెల్లెళ్ళే’ ఆయుధాలా.?

Sharmila Kavitha

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ” చెల్లెళ్ళ” పాత్ర చాల కీలకంగా మారిపోయింది. వైసీపీ, బిఆర్ఎస్ పార్టీల కు చెల్లెళ్ళ రూపంలో అనుకోని విపత్తు వచ్చిపడిందనే చెప్పాలి. ఏపీ రాజకీయాలను నుండి వైతొలగి తెలంగాణ రాజకీయాలకు వెళ్లిన వైస్ షర్మిల తిరిగి పుట్టింటికి చేరి వైసీపీలో కుంపటి రాజేసింది.

ఇక కవిత విషయానికి వస్తే ప్రత్యక్ష ఎన్నికలలో తనకు జరిగిన భంగపాటుకు పరోక్ష పద్దతిలో ఎమ్మెల్సీ పదవి చేపట్టి దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో లిక్కర్ స్కాం లో ఇరుక్కొని తెలంగాణలో బిఆర్ఎస్ పునాదులు కదిలించి పార్టీని విలీనం అంచులదాకా తీసుకెళ్లింది.

ADVERTISEMENT

పదవిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసి కవిత బిఆర్ఎస్ కు చేటు చేస్తే, రాజకీయాలలో పదవిని ఆశించి వైసీపీ పాలిట శాపంలా మారింది షర్మిల. ఇలా సొంత చెల్లి ‘తో’ రాజకీయం చేస్తూ అన్న ఏపీలో పోరాడుతుంటే, చెల్లి ‘కోసం’ తెర వెనుక రాజకీయం నడిపిన అన్న తెలంగాణలో ఆరాటపడుతున్నాడు.

తన పార్టీని కాపాడుకోవడానికి ఒక అన్న చెల్లిని రాష్ట్రం దాటించడానికి పావులు కదుపుతుంటే, తన పార్టీని బలపరుచుకోవడానికి ఒక అన్న చెల్లిని రాష్ట్రానికి తీసుకురావడానికి మంతనాలు కొనసాగిస్తున్నారు. రాజకీయాలలో బంధాలకు, బంధుత్వాలకు చోటు ఉండదని జగన్, షర్మిల నిరూపిస్తున్నారు.బంధాలు, బంధుత్వాలు కోసం రాజకీయాలు పక్కన పెట్టాలని కవిత, కేటీఆర్ రుజువు చేస్తున్నారు.

అన్నతో యుద్దానికి సై అంటే సై అంటూ వైసీపీ మీద కధం తొక్కుతున్నారు షర్మిల. అన్న మాటకు సై అంటూ బీజేపీ తో యుద్దాన్ని ముగిస్తున్నారు కవిత. అయితే ఈ ఇద్దరి అన్నలకు సమస్యగా మారిన చెల్లెళ్ళ వెనుక రెండు జాతీయ పార్టీల బలమైన వ్యూహం కనపడుతుంది. అన్నను జైలుకు పంపిన కాంగ్రెస్ షర్మిలతో రాజకీయం నడిపిస్తుంటే, చెల్లిని అరెస్టు చేసిన బీజేపీ అన్నతో రాజకీయం చేస్తుంది.

ఏపీలో షర్మిల తో జగన్ కు చెక్ పెట్టి మునపటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చాలన్న ఆలోచనతో కాంగ్రెస్ షర్మిలకు కొండంత అండగా నిలబడితే, తెలంగాణలో బిఆర్ఎస్ క్యాడర్ ను బీజేపీ గూటికి రప్పించి బీజేపీ బలం పెంచుకోవడానికి కవిత వెనుక కొండంత భారంగా బీజేపీ నిలబడింది. ఈ రెండు జాతీయ పార్టీలు చెల్లెళ్లను ఆయుధాలుగా మార్చుకుని అన్నల రాజకీయ భవిష్యత్ కు చెక్ పెట్టాలని చూస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories