ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయనగానే, ముందుగా సభకు రాకుండా మొహం చాటేస్తున్న జగన్ పేరే వినిపిస్తుండటం విచిత్రం.
ఎప్పటిలాగే ఈసారి కూడా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ వ్యవహారం గురించి మాట్లాడారు. “శాసనసభ సమావేశాలకు హాజరుకాని సభ్యులకు ప్రభుత్వం చెల్లించిన జీతాలు వెనక్కు తీసుకునేలా పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. దీనిని దేశంలో అన్ని రాష్ట్రాలకు వర్తించేలా ఉండాలని సూచించాను. కేంద్రం నుంచి ఇంకా జవాబు రాలేదు.
వైసీపీ సభ్యులు శాసనసభలోనికి రాకుండా బయట నుంచే సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రజలు ఎమ్మెల్యేలను ఎందుకు ఎన్నుకుంటారు? తమ సమస్యలను శాసనసభలో చర్చించి పరిష్కరిస్తారనే కదా? కానీ సభకు రాకుండా వారికి అన్యాయం చేస్తున్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని వైసీపీ రోడ్లపై ఆందోళనలు చేసే బదులు జగన్ తన ఎమ్మెల్యేలతో శాసనసభకు వచ్చి ప్రభుత్వాన్ని అడగవచ్చు కదా?” అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
ఒక ప్రైవేట్ లేదా ప్రభుత్వోద్యోగి డ్యూటీకి రాకపోతే జీతంలో కోత విధిస్తారు. ఒకవేళ పదేపదే అలా చేస్తుంటే సస్పెండ్ చేస్తారు లేదా ఉద్యోగంలో నుంచి తొలగిస్తారు కదా? కానీ ప్రజా ప్రతినిధులకు మాత్రం మినహాయింపు దేనికి?
ఒకవేళ ఎమ్మెల్యేలకు శాసనసభకు వచ్చేందుకు తీరిక లేదు.. జీతాలు కూడా అవసరం లేదనుకుంటే లిఖితపూర్వకంగా స్పీకర్‌కి తెలియజేయవచ్చు. కానీ సభకు రాకుండానే ప్రతీ ఒక్కరూ జీతాలు తీసుకుంటూనే ఉన్నారు.
ఈవిధంగా ఇతర రాష్ట్రాలలో ఇంకెంత మంది ఉన్నారో? అందరికీ కలిపి ప్రభుత్వాలపై ఎంత భారం పడుతోందో? ఎవరికీ తెలియదు. కనుక స్పీకర్ అయ్యన్న పాత్రుడు కేంద్రానికి చేసిన సూచనని అమలు చేయగలిగితే అన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు దారికొస్తారు. రాకుంటే కనీసం ఖజానాపై ఆ మేరకు భారం తగ్గుతుంది కదా?
దీనిపై ఏదో మొక్కుబడిగా విజ్ఞప్తి చేస్తే ప్రయోజనం ఉండదు. సిఎం చంద్రబాబు నాయుడు, ఎంపీలు కూడా చొరవ తీసుకొని చట్టం చేసేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తే బాగుంటుంది.




