ధియేటిరికల్ ట్రైలర్ క్లిక్స్ తో మొదలైన “బాహుబలి 2” ప్రభంజనం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో అరుదైన రికార్డు ‘బాహుబలి 2’ ఖాతాలో వచ్చి చేరింది. బాక్సాఫీస్ వద్ద 1600 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ సినిమా ‘కౌంటర్ టికెట్స్’ రికార్డులను తిరగరాసింది. 10.5 కోట్ల మంది ధియేటర్ లో కౌంటర్ వద్ద టికెట్లు తీసుకున్న సినిమాగా “బాహుబలి 2” సరికొత్త చరిత్రను సృష్టించింది.
‘బాహుబలి పార్ట్ 1’ ఖాతాలో కూడా ఈ ‘కౌంటర్ టికెట్’ రికార్డు ఉన్నప్పటికీ, అది 2015 సంవత్సరం వరకే పరిమితమైంది. అయితే ‘బాహుబలి 2’ మాత్రం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీనే తిరగరాసే విధంగా ఆల్ టైం ‘ధియేటర్ కౌంటర్ టికెట్’ రికార్డును అందుకుంది. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ అక్కడక్కడ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
ఈ సినిమా ఇంత విజయం సాధించింది కాబట్టే, ఇప్పటికే దర్శకుడు రాజమౌళి గానీ, హీరో ప్రభాస్ గానీ దీని నుండి బయటకు రాలేకపోయారు. ‘బాహుబలి 2’ ప్రభావంతో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ప్రభాస్ “సాహో”కు కూడా ఇంకా కసరత్తులు చేసే పనిలో ఉన్నారు. అలాగే రాజమౌళి కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. ధియేటర్ల వద్ద హంగామా పూర్తైనప్పటికీ, ఇంకా రికార్డుల వెల్లువ కొనసాగుతుండడం విశేషం.



