సరిగ్గా గతేడాది ఇదే సమయానికి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ అంతా “బాహుబలి 2” మేనియాతో ఊగిపోతోంది. 2017, ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే బంపర్ టాక్ రావడంతో, ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయ్యింది, ట్రేడ్ పండితులు ‘ఔరా’ అంటూ నోరెళ్ళబెట్టారు. అంతలా కనకవర్షం కురిపించిన “బాహుబలి 2” మేనియా మళ్ళీ పునరావృతం కాబోతోందా? అంటే అవుననే సంకేతాలే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఇండియాలో కాదు, చైనాలో!
అవును… మే 4వ తేదీన చైనాలో ‘బాహుబలి 2’ విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్సు బుకింగ్స్ లో స్థానిక చైనా చిత్రాల కంటే ‘బాహుబలి 2’ ముందుందని ట్రేడ్ పండితులు స్పష్టం చేస్తున్నారు. దీంతో చైనాలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. చైనాలో అమీర్ ఖాన్ ‘దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్,’ సల్మాన్ ఖాన్ ‘భజరంగ్ భాయిజాన్’ వంటి సినిమాలు రికార్డు స్థాయిలో కాసులు కురిపించడంతో, ఇండియాతో పాటు ఇతర దేశాలను ఊపేసిన ‘బాహుబలి 2’ చైనాలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందోనని ట్రేడ్ విశ్లేషకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇప్పటివరకు దాదాపుగా 1600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళను సాధించిన ‘బాహుబలి 2’ ఖాతాలో మరో 400 కోట్లు చేరితే 2000 క్లబ్ ఖాతాను సృష్టించినట్లే! ఇది లాంచన ప్రాయమే కావచ్చు గానీ, అమీర్ ఖాన్ ‘దంగల్’ రికార్డుల దరిదాపులకు వెళ్తుందా? లేదా? అనేది అందరిలో నెలకొన్న ఉత్కంఠ. అదే చేరుకుంటే, 2000 కోట్లు కాదు, అంతకు రెట్టింపు కలెక్షన్ల క్లబ్ ను ‘బాహుబలి 2’ సాధించినట్లవుతుంది. అయితే ‘బాహుబలి 1’ను మాత్రం చైనా ప్రేక్షకులు ఆశించినంతగా ఆదరించకపోవడం అనేది కూడా తెలిసిన విషయమే.



