ఏప్రిల్ 1వ తేదీ… నూతన ఆర్ధిక సంవత్సరం తొలి రోజు… అయితే ఈ నెల మొత్తం ‘బాహుబలి’ నెలగా మారబోతోంది. అవును… ఎప్పుడో నెలాఖరున ఏప్రిల్ 28వ తేదీన విడుదల కాబోయే “బాహుబలి 2 – ది కన్ క్లూజన్” సినిమా హంగామా ఈ 28 రోజుల పాటు ఉండనుంది. అయితే ఇది ఏ రూపంలో ఉంటుంది అనుకుంటే మాత్రం పొరపాటే… ఎందుకంటే… ప్రస్తుతం ఏ సినీ అభిమానిని కదిపినా వెలువడే ఒకే ఒక్క మాట… ‘బాహుబలి2.’
ట్రైలర్ విడుదల వరకు అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పలేం గానీ, ట్రైలర్ విడుదల తర్వాత మాత్రం ఎవరెస్ట్ కు చేరుకున్నాయని చెప్పవచ్చు. నిజానికి ఈ రేంజ్ అంచనాలను అందుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఒక్క రాజమౌళి సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే విషయంగా ట్రేడ్ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. స్వతహాగా తెలుగు సినిమా అయిన దీనిని బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ వర్గాలు తమ చిత్రంగా భావిస్తుండడం విశేషం.
అందుకే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక సినిమా 1000 కోట్లు ఖచ్చితంగా వసూలు చేస్తుందని ఇండియన్ సినీ పరిశ్రమ వర్గీయులు బలంగా నమ్ముతున్నారు, దానికి తగిన విధంగానే పబ్లిసిటీ ఇస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే… ఇప్పటివరకు ట్రేడ్ వర్గీయులు అంచనాలు వేసిన దానికంటే ‘అంతకు మించి’ వసూలు చేసినా ఆశ్చర్యపడనవసరం లేదని కూడా చెప్తున్నారు. దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి.
‘బాహుబలి 2’ విడుదలయ్యే నాటికి విద్యార్ధుల పరీక్షలన్నీ ముగిసిపోయి ఉండడం ఒకటైతే, అమెరికా నుండి ఆంధ్రప్రదేశ్ వరకు ఈ సినిమా టికెట్ ధరలను అమాంతం పెంచేయడంతో, ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్ ను ఓ రెండు, మూడు రోజుల్లో దాటి వేస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వేస్తున్న అంచనాలన్నీ కార్యరూపం దాలిస్తే… ఇండియాలోనే రాజమౌళి నెంబర్ 1 దర్శకుడిగా అవతరిస్తాడని చెప్పడంలో సందేహం లేదు.



