బ్యాక్ గ్రౌండ్ స్కోర్… థమన్ Vs దేవి!

బ్యాక్ గ్రౌండ్ స్కోర్... థమన్ Vs దేవి!పదిహేను రోజుల వ్యవధిలో విడుదలైన రెండు పెద్ద సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే “అఖండ” అమోఘమైన విజయాన్ని సొంతం చేసుకోగా, లేటెస్ట్ గా అల్లు అర్జున్ “పుష్ప” కూడా అదే బాటలో పయనించే సంకేతాలు కనపడుతున్నాయి. బన్నీ నట విశ్వరూపానికి నిదర్శనంగా పేర్కొంటున్న “పుష్ప”లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కొన్ని కొన్ని సన్నివేశాలలో బ్యాక్ గ్రౌండ్ సరిగా వినిపించకపోవడం అలాగే డైలాగ్స్ సరిగా అర్ధం కాకపోవడంపై నెటిజన్ల మండిపడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రూపొందించి ఇలాంటి చిన్న చిన్న లోపాలను పట్టించుకోకపోతే ఎలా? అందులోనూ ‘మిస్టర్ పర్ ఫెక్ట్’గా కొలిచే సుకుమార్ కూడా ఇలాంటి వాటికి తావిచ్చే విధంగా ఉంటే ఎలా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

తొలుత ప్రదర్శించిన షోలతో ధియేటర్ ఇబ్బంది అనుకున్నారు గానీ, రోజు గడుస్తున్న కొద్దీ ఇదే అభిప్రాయం సోషల్ మీడియా అంతటా వినిపించడంతో దేవి సౌండ్ మిక్సింగ్ పై విమర్శలు వస్తున్నాయి. అలాగే సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పట్ల నిరాశ కనపడుతోంది. ముఖ్యంగా ఇటీవల టాలీవుడ్ ను షేక్ చేసిన “అఖండ”లో థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండో హీరోగా మారిపోవడంతో, థమన్ తో పోలుస్తున్నారు.

సెకండాఫ్ లో అఘోరా క్యారెక్టర్ బ్యాక్ గ్రౌండ్ తో మొత్తం ఇండస్ట్రీని అంతా తన వైపుకు తిప్పుకున్న థమన్ పేరు సోషల్ మీడియాలో కూడా మారుమ్రోగిపోయింది. కానీ “పుష్ప”లో దేవి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదన్నది నిజమే. సినీ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని వ్యక్తపరిచారు. బహుశా సమయాభావం దీనికి ప్రధాన కారణం అయ్యుండొచ్చు.

చివరి నిముషం వరకు ఈ సినిమా కోసం సుకుమార్ అండ్ దేవిశ్రీలు వర్క్ చేస్తూనే ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా దేవి హాజరు కాలేదు. అంతలా వర్క్ లోడ్ ఉండడం, అలాగే 17వ తేదీ నాటికి ఎలా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే తాపత్రయంతో కొన్ని చోట్ల సౌండ్ మిక్సింగ్ తేడాలు ఉన్నప్పటికీ అలాగే రిలీజ్ చేసేసారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ సమయ లోపం కారణమై ఉండొచ్చు.

పూర్తి కమర్షియల్ సబ్జెక్టు అయిన ‘పుష్ప’లో అన్ని పాటలను సూపర్ హిట్ గా నిలపడంలో సక్సెస్ అయిన దేవి, బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోయారు. దీంతో సహజంగానే ‘అఖండ’తో థమన్ పేరు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఒక్క ‘అఖండ’ మాత్రమే కాదు, రాబోయే సినిమాల టీజర్స్ లో గానీ, ట్రైలర్స్ లో గానీ థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మిగిలిన సంగీత దర్శకులను డామినేట్ చేస్తున్నారన్నది వాస్తవం.

అందుకే పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”కు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నారు. గతంలో రవితేజ “క్రాక్” సినిమాలో కూడా థమన్ మ్యూజిక్ గురించి అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. ఒకప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు నిలయంగా టాలీవుడ్ లో మణిశర్మ పేరు వినిపించేది, ఇపుడు తన శిష్యుడు థమన్ ట్రెండ్ కు అనుగుణంగా అప్ డేట్ అవుతూ సందడి చేస్తున్నాడు.

ADVERTISEMENT
Latest Stories