కమెడియన్లు హీరోలు కావడం చూశాం కానీ దర్శకులుగా మారడం అరుదు. అలా అని లేరని కాదు. రాజబాబుతో మొదలుపెట్టి మైక్ పట్టుకుని యాక్షన్ చెప్పినవాళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నారు. ఏవిఎస్ సూపర్ హీరోస్, ఎంఎస్ నారాయణ కొడుకు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం రెండు తోకల పిట్ట, కృష్ణ భగవాన్ జాన్ అప్పారావు 40 ప్లస్ ఇవన్నీ ఆ క్యాటగిరీలోకి వచ్చేవే. విచిత్రం ఏంటంటే వీటిలో అధిక శాతం సీరియస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందినవి. అవుట్ అండ్ అవుట్ నవ్వించేలా ఉండవు. ఈ లిస్టులోకి వేణు వచ్చాడు.
సుకుమార్ జగడంతో వెలుగులోకి వచ్చిన వేణు చాలా కాలం ఎన్నో పాత్రలు వేశాడు కానీ సునీల్, బ్రహ్మానందం స్థాయిలో తనకు గుర్తింపు అవకాశాలు రెండూ రాలేదు. పరిశ్రమకు దర్శకుడు కావాలని వచ్చాడో ఏమో ఇన్నేళ్ల తర్వాత బలగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ అండతో. ఇంకేం ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్రమోషన్లు గట్రా బాగానే జరిగాయి. తెలంగాణ నేపథ్యం కాబట్టి ఊరూరా తిరిగి విడుదల గురించి గట్టిగా చెప్పుకున్నారు. ఇంత చేసిన ఈ బలగంలో నిజంగా బలముందా.
పల్లెటూళ్ళు కల్లాకపటం ఎరుగని మనుషుల మధ్య తల్లో నాలుకలా కలిసిపోయే ఓ ముసలి తాత చనిపోతాడు. ఎప్పుడో పెళ్లెప్పుడు చిన్న మాట పట్టింపు వల్ల విడిపోయిన కూతురు అల్లుడు ఇంటికొస్తారు. అప్పట్లో గొడవకు కారణమైన కొడుకులిద్దరూ వీళ్ళతో మాట్లాడరు. మధ్యలో పెళ్లి జరిగితే అప్పులు తీరతాయని ఎదురు చూస్తున్న మనవడు ఈ పరిణామాల వల్ల హతాశుడవుతాడు. పెద్ద కర్మ కోసం పిండం పెడితే కాకులు రావు. ఊరంతా కలిసి దీనికి పరిష్కారం కోసం నడుం బిగిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే బలగం అసలు కథ.
కాలం ఎంత మారినా 5జి టెక్నాలజీ వచ్చి యువత పరుగులు పెడుతున్నా భావోద్వేగాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఇవి అడుగంటిపోయినప్పుడు రక్తం పంచుకు పుట్టినవాళ్ళు సైతం శత్రువుల్లా కనిపిస్తారు. ఈగోలకు పోతే కాపురాలు కూలిపోతాయి. పెద్దోళ్ల ఆత్మలకు అశాంతి మిగులుతుంది. వేణు చెప్పాలనుకున్న సందేశం ఇదే. కాకపోతే తాను పుట్టి పెరిగిన తెలంగాణ మట్టిని తెరమీద చూపించాలనే తాపత్రయంలో ఎమోషన్లను చాలా పెద్ద మోతాదులో రాసుకున్నాడు తెరకెక్కించాడు. నవ్వించాడు ఏడిపించాడు.
క్యాస్టింగ్ ఆకర్షణలు లేకుండా ఇంత ఎమోషన్ ని తెరమీద పండించడం చాలా కష్టం. వేణు తన శాయశక్తులా ప్రయత్నించాడు. అయితే బేసిక్ గా సినిమా అనేది వినోదాన్ని ఇవ్వడానికి. పదే పదే ఏడుపులు, పెడబొబ్బలు, అరుచుకోవడాలు, గొడవలు పెట్టుకోవడాలు చేస్తే టైంపాస్ కోసం వచ్చిన సగటు ఆడియన్స్ కి ఇదంతా బోర్ కొట్టొచ్చు. సున్నిత మనస్కులు ప్రతి పావుగంటకోసారి గుండె తడిని తడుముకుంటూ కన్నీళ్లు ఆపుకుంటారు. ఇందులో రెండూ ఉన్నాయి. బలగంని జనం ఏ క్యాటగిరీలో వేస్తారనే దాని మీద కమర్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంది. ఏది ఏమైనా మాస్ చిత్రాల హోరులో ఇలాంటి సెన్సిబుల్ సినిమాలు అప్పుడప్పుడైనా వస్తూ ఉండాలి.



