మున్సిపల్ ఎన్నికలలో సీట్ల కేటాయింపుపై టీడీపి, జనసేన రెండు పార్టీలలో తిరుగుబాట్లు కూటమి ఐఖ్యతని, మనుగడని ప్రశ్నిస్తున్నట్లే ఉన్నాయి. టీడీపి కంటే జనసేనలో ఈ అసంతృప్తి, తిరుగుబాట్లు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీట్లసర్దుబాట్లలోనే జనసేనకు తీరని అన్యాయం జరిగిందంటూ ఆక్రోశిస్తున్న జన సైనికులు, మళ్ళీ వాటినీ టీడీపిలో నుంచి వచ్చి చేరిన వారికి కట్టబెడుతుండటంపై మండి పడుతున్నారు.
ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప స్వప్న, నర్సీపట్నంలో అద్దేపల్లి సౌజన్య, తిరుపతి జిల్లా వరదపాలెం నుంచి వెంకటేష్ ఇంకా పలుచోట్ల జనసేన తిరుగుబాటు అభ్యర్ధులుగా నామినేషన్స్ వేస్తున్నారు.
గతంలో ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన జెండాలు మోసిన తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కేటాయించడం జీర్ణించుకోలేకపోతున్నామని చాలా స్పష్టంగా చెపుతున్నారు.
మరికొందరు సమన్వయకర్తలమైన తమకు మాట మాత్రంగానైనా చెప్పకుండా తమ అధిష్టానం ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి సీట్లు కేటాయించడం పదవులు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అద్దేపల్లి సౌజన్య వంటివారు కొందరు తమకు అన్యాయం జరిగిందనిపిస్తే, నామినేషన్స్ వేసి పోటీ చేయమని తమ అధిష్టానమే చెప్పిందనడం విశేషం.
టీడీపిలో కూడా ఇలాంటి అసమ్మతి స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గొల్లప్రోలు మున్సిపాలిటీని జనసేనకు కేటాయించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపి నేతలు, 28 స్థానాలకు నేడు నామినేషన్స్ వేయబోతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో ఇంకా పలుచోట్ల టీడీపి, జనసేన అభ్యర్ధులు పోటాపోటీగా నామినేషన్స్ వేసేందుకు సిద్దమవుతున్నారు.
ఇక్కడ వారిలో ఎవరో ఒకరు వెనక్కు తగ్గినా లేదా గెలిచినా కథ సుఖాంతం అవుతుంది. కానీ ఓట్లు బదిలీ కాక చీలిపోయి రెండు పార్టీలు నష్టపోవడమే కాకుండా రెండూ కలిసి వైసీపీని గెలిపించినట్లవుతుంది కూడా. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న వైసీపీ తప్పకుండా దీనిని సద్వినియోగించుకుని లాభపడే ప్రయత్నం చేస్తుంది.
ఎన్నికల సమయంలో ఇలాంటి అసంతృప్తి స్వరాలు, తిరుగుబాట్లు, అలకలు సర్వ సాధారణమే అనిపించవచ్చు. కానీ ఇవే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మనోభావాలను అద్దం పడుతున్నాయి.
రాష్ట్ర స్థాయిలో, అధిష్టానం స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించుకున్నట్లే, రెండు పార్టీలు ముందుగానే పట్టణ, గ్రామ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకొని ఉమ్మడి అభ్యర్థులను ఖరారు చేసుకొని ఉండి ఉంటే నేడు ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా?
మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఈవిధంగా ఉంటే, ఇంకా జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిలో ఇంకెంత రాద్దాంతం జరుగుతుందో?





