బాలయ్య బయటకొచ్చి క్షమాపణ చెబితే మంచిది!

Balakrishna_Akkineni_Commentఇది సోషల్ మీడియా కాలం. మనం ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఏదో ధ్యాసతో ఏ మాటలన్నా వెంటనే అది కార్చిచ్చులా క్షణాల్లో పాకిపోతోంది. అందులోనూ స్టార్ హీరోలకు సంబంధించిన వ్యవహారమైతే చెప్పేదేముంది. వీరసింహారెడ్డి విజయోత్సవంలో బాలకృష్ణ అన్న అక్కినేని తొక్కినేని మాటలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎలాంటి దురుద్దేశం లేకపోయినా అవసరానికి మించిన ఉత్సాహంతో చుట్టూ అందరూ చప్పట్లు కొడుతున్నారని ఫ్యాన్స్ ఈలలు వేస్తున్నారని తండ్రి గొప్పదనాన్ని చెప్పబోతూ స్లిప్ అయిన విధానం గట్టి విమర్శలు తెచ్చిపెట్టింది. ట్విట్టర్ లో ఏఎన్ఆర్ అభిమానులు దీని మీద తీవ్ర స్వరం వ్యక్తం చేశారు

త్వరగానో ఆలస్యమో ఏదో ఒకటి మొత్తానికి అక్కినేని సోదరులు నాగ చైతన్య, అఖిల్ ఈ అంశానికి సంబంధించి ఒకే స్పందన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలైన నందమూరి తారకరామరావు అక్కినేని నాగేశ్వరరావు ఎస్వి రంగారావు గార్లను అగౌరవపరిస్తే మనల్ని మనం కించపరుచుకున్నట్టేనని ఇంగ్లీష్ తెలుగు రెండు భాషల్లో ఒకే సందేశాన్ని అందజేశారు. ఇది చాలా గౌరవప్రదంగా ఉంది. మరో వివాదానికి తావివ్వకుండా ఎన్టీఆర్ కి పేర్ల వరసలో అగ్ర తాంబూలం ఇస్తూ ఇక్కడితో స్వస్తి పలకాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపించింది. అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి ట్వీట్ చేయడంతో అప్పటిదాకా కినుక వహించిన ఫ్యాన్స్ సంతృప్తి చెందారు

ADVERTISEMENT

ఇప్పుడు బంతి బాలయ్య కోర్టులో ఉంది. ముందు వెనుకా చూసుకోకుండా అనిపించింది మాట్లాడ్డమే తీరుగా పెట్టుకున్న వైనం గతంలోనూ పలు ఇబ్బందులను తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీలోని తన తండ్రి సమకాలీకుడైన లెజెండరీ కుటుంబంతో అపార్థం వచ్చేలా చేసింది. ఈ డ్యామేజ్ ని ఆయనే రిపేర్ చేసుకోవాలి. త్రివిక్రమ్ రాసినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఇప్పుడు తెలుసుకోవాలి. క్షమాపణ చెప్పడం వల్లనో లేదా ఎందుకిలా జరిగిందనే సవివరణ ఇవ్వడం వల్లనో నందమూరి ప్రతిష్ఠకు ఎలాంటి మచ్చా రాదు. పైపెచ్చు తొందరపాటుని తెలుసుకుని సరిచేసుకున్నారనే గౌరవం దక్కుతుంది. తక్షణ కర్తవ్యం ఇదే

బాలకృష్ణ నాగార్జునల మధ్య అంతగా సయోధ్య లేదని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట నిజం కాదని ఋజువు చేయాలంటే దీనికంతటికి చెక్ పెట్టాలి. బాబాయ్ అని చనువుగా పిలిచే ఏఎన్ఆర్ పై తాను కావాలని ఎందుకు నోరు జారతానని వివరించాలి. ఇద్దరూ కలిసి భార్యభర్తల బంధం, గాండీవం సినిమాల్లో నటించిన జ్ఞాపకాలు ఉన్నాయిగా. నాన్న ఎన్టీఆర్ తో 14 చిత్రాల ప్రయాణం అక్కినేది. సో ఒక మెట్టు దిగడం వల్ల మేలే జరిగే అవకాశం ఉన్నప్పుడు అది వీలైనంత త్వరగా చేసేయాలి. కొడుకు ఈడు పిల్లలు ఇలా ట్వీట్ పెట్టే దాకా తేవడంలోనే లేట్ అయిపోయింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. అక్కినేని గౌరవమైనా తనదైనా ఒకటేనని గుర్తించి బాలయ్య స్పందిస్తే కథ సుఖాంతమవుతుంది

ADVERTISEMENT
Latest Stories