ఇటీవల జనసేన పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణకు అందరూ ఊహించినట్లే ఆ పార్టీ మేయర్ అభ్యర్ధిగా అవకాశం దక్కించుకున్నారు.
వంగవీటి రాధాకృష్ణ వంటి మంచి ఫాలోయింగ్ ఉన్న పాపులర్ నాయకుడు. అటువంటి బలమైన అభ్యర్ధి బరిలో ఉన్నప్పుడు వైసీపీ కూడా ఆయనకు ధీటైన వ్యక్తిని బరిలో దించాలి. కానీ రాయన భాగ్యలక్ష్మిని వైసీపీ మేయర్ అభ్యర్ధిగా ప్రకటించడం గమనిస్తే, పరోక్షంగా వంగవీటి గెలుపుకు సహకరించేందుకేనని భావించవచ్చు.
కనుక ప్రత్యక్ష పద్దతిలో జరుగబోతున్న ఈ ఎన్నికలలో వంగవీటి రాధాకృష్ణ మేయర్ పదవి దక్కించుకోవడం లాంచనప్రాయమే పెద్ద కష్టం కాదనే చెప్పాలి.
అయితే ఆయన కంటే తక్కువ స్థాయి నేతలు మంత్రి పదవులు పొందగా, లోక్సభకు వెళ్ళగా ఆయన మాత్రం ప్రతీసారి రాంగ్ టైమింగ్.. రాంగ్ ప్లేసులో ఉంటూ అనేక గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోయారు.
2004 లో అయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు.
ఆ తర్వాత 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలోకి మారి ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉండి ఉంటే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచేవారు. మంత్రి పదవి కూడా పొందేవారేమో?
మళ్ళీ 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పోటీ చేసి టీడీపి అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఒకవేళ అప్పుడే వైసీపీకి బదులు టీడీపిలో చేరి సీటు దక్కించుకొని గెలిచి ఉంటే, మంత్రి పదవి లభించి ఉండేదేమో?
అప్పటి నుంచి 2019 ఎన్నికల సమయం వరకు వంగవీటి రాధాకృష్ణ వైసీపీలోనే ఉన్నారు. జగన్ అయనకు విజయవాడ తూర్పు (అసెంబ్లీ) లేదా మచిలీపట్నం నుంచి లోక్సభ సీటు ఆఫర్ చేస్తే తిరస్కరించి మరో గొప్ప అవకాశం చేజార్చుకున్నారు.
ఒకవేళ వాటిలో ఏదో ఒకటి తీసుకొని ఉంటే, జగన్ ప్రంభంజనంలో అలవోకగా గెలిచి మంత్రి పదవి లేదా లోక్సభలో అడుగుపెట్టి ఉండేవారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీని వీడి టీడీపిలో చేరి 2024 ఎన్నికల నాటికి ఆ పార్టీలోనే ఉన్నారు. కానీ ఆ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండిపోయి మరో గొప్ప అవకాశం చేజార్చుకున్నారు. ఒకవేళ పోటీ చేసి ఉండి ఉంటె టీడీపి ప్రభంజనంలో అవలీలగా గెలిచి ఉండేవారు. బహుశః చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి అయ్యేవారేమో?
ఇన్ని గొప్ప అవకాశాలు చేజార్చుకున్న వంగవీటి రాధాకృష్ణ, ఇప్పుడు జనసేనలో చేరి మేయర్ పదవికి పోటీ చేస్తుండటం అంటే, రాజకీయాలలో మళ్ళీ ఏబీసీడీలు దిద్దడం మొదలుపెట్టినట్లే కదా? కానీ తప్పదు. కష్టమైనా నష్టమైనా ఇకపై జనసేనను అంటిపెట్టుకొని ఉంటే ఆయనకే మంచిది. లేకుంటే మరో గొప్ప అవకాశం ఎదో చేజార్చుకోవచ్చు.





