సినీ, రాజకీయ సెలబ్రిటీలకు, వ్యాపార దిగ్గజాలకు నెంబర్లపై ఉండే మోజు, సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమకు కావాల్సిన నెంబర్ కోసం ఎంత మొత్తమైనా పెట్టడానికి సిద్ధంగా ఉండే వీరి ఆలోచనలు… ప్రభుత్వాలను వరంగా మారుతున్నాయి. ఈ రూపేణా రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుండడంతో… ఈ పోటీతత్వం మరింత పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ లో ఖైరతాబాద్ లో కొత్త సీరియల్ ప్రారంభం కావడంతో… ఫ్యాన్సీ నెంబర్లు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.
ఇందులో నందమూరి నటసింహం బాలకృష్ణ కారుకు సంబంధించిన వాహనం కూడా ఉండడం విశేషం. ‘టీఎస్ 09 ఈయూ 0001’ నెంబర్ కోసం బాలకృష్ణ ఏకంగా 7.77 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం విశేషం. అయితే అంతకు ముందు సీరియల్ లో చివరి నెంబర్ అయిన ‘టీఎస్ 09 ఈటీ 9999’ నెంబర్ కోసం గవి కన్‌స్ట్రక్షన్స్ సంస్థ తమ బెంజ్ కారుకు వేయించుకునేందుకు 10.05 లక్షలు ఖర్చు పెట్టింది. అలాగే ‘టీఎస్ 09 ఈయూ 0099’ నంబర్ ను ఆర్‌ఎస్ బ్రదర్స్ సంస్థ 2.70 లక్షలకు సొంతం చేసుకుంది.



