‘ఏమైంది ఈ వేళ, రచ్చ’ వంటి కమర్షియల్ హిట్స్ తర్వాత సంపత్ నంది దర్శకత్వం వహించిన “బెంగాల్ టైగర్” చిత్రం ‘హ్యాట్రిక్’ను అందిస్తుందా? అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు రవితేజ అభిమానులు. సంపత్ నంది దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘ఏమైంది ఈ వేళ’ విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు, కమర్షియల్ గా మంచి సక్సెస్ ను చవిచూసింది. ఇక, ‘రచ్చ’ కమర్షియల్ గా మాత్రమే పర్వాలేదనిపించింది. దీంతో ‘బెంగాల్ టైగర్’ ద్వారా సంపత్ నంది తన ప్రతిభను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
భారీ అంచనాల నడుమ విడుదలైన “బెంగాల్ టైగర్” మాస్ మహారాజా అభిమానులను అలరించే చిత్రంగా టాక్ తెచ్చుకుంది. రవితేజ ఎనర్జిటిక్ నటన, తమన్నా, రాశి ఖన్నాల గ్లామర్ షో, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ కామెడీ, మాస్ బాణీలు హైలైట్స్ గా నిలువగా, రొటీన్ కధాంశం, క్లైమాక్స్ సినిమాకు మైనస్ గా మారాయి. ఫస్టాఫ్ అంతా కామెడీ పండడంతో ఇంటర్వెల్ సమయానికి మంచి ఊపుతో బయటకు వచ్చిన ఆడియన్స్ కు సెకండాఫ్ చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. అయితే రాశి ఖన్నా బికినీ, తమన్నా వాన పాట పరువాలు ప్రేక్షకులకు కాసింత రిలీఫ్.
బాక్సాఫీస్ వద్ద మరే చిత్రం లేకపోవడం “బెంగాల్ టైగర్”కు కలిసొచ్చే అంశం. ‘రచ్చ’ మాదిరిగానే మరో కమర్షియల్ సక్సెస్ ను సంపత్ నంది చవిచూడవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే “కిక్ 2″తో డీలాపడ్డ రవితేజనకు కూడా కాస్త ఉపశమనం కలిగించే చిత్రంగా “బెంగాల్ టైగర్” నిలుస్తుందని ప్రేక్షకుల టాక్.





