మలయాళ ముద్దుగుమ్మ భావనపై జరిగిన అఘాయిత్యంలో స్టార్ హీరో దిలీప్ హస్తం ఉందన్న అంచనాలు మొదట నుండి వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు స్నేహితులుగా మెలిగిన వీరిద్దరినీ, దిలీప్ రెండో వివాహం వీరి స్నేహాన్ని బీటలు వారేలా చేసింది. నాడు భావనను కారులో అపహరించడం, వీడియోలు తీయడం వంటి స్కెచ్ లు వేసింది దిలీప్ అన్న టాక్ ఉన్న నేపధ్యంలో… ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భావన ఘటన గురించి దిలీప్ వివరణ ఇచ్చుకున్నాడు.
“ఈ కేసులో ప్రధాన నిందితుడుగా జైల్లో ఉన్న పల్సర్ సునీ, భావనకు మంచి స్నేహితుడని, అందుకే స్నేహితులను ఎంపిక చేసుకునేటపుడు జాగ్రత్త వహించాలని” దిలీప్ హెచ్చరించాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన భావన కాస్త గట్టిగానే దిలీప్ గురించి స్పందించింది. “ప్రధాన నిందితుడు పల్సర్ సునీ, తాను స్నేహితులమని ఒక నటుడు చెప్పినట్టు తనకు తెలిసిందని, ఆ వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని, ఇలాంటి అవాకులు, చవాకులు పేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని” తీవ్రంగా వ్యాఖ్యానించింది.
“తాను నోరు విప్పి మాట్లాడితే విచారణపై ప్రభావం చూపుతుందని పోలీసులు సూచించడంతో మౌనంగా ఉన్నానని, తన సహనాన్ని, మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దని” దిలీప్ పేరు ఎత్తకపోయినా… దిలీప్ కు తగిలే విధంగా వార్నింగ్ ఇచ్చింది భావన. దీంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అంతకుముందు జైలులో ఉన్న పల్సర్ సునీ తనను బెదిరిస్తున్నాడని దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.



