త్వరలో బుల్లితెరపై ప్రసారానికి రెడీ అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ “బిగ్ బాస్” షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితాలో రోజుకో పేరు హల్చల్ చేస్తోంది. బుల్లితెర టాప్ తారామణులు సుమ, అనసూయ వంటి వారు ఆసక్తి చూపించడం లేదన్న టాక్ తెలిసిందే. ఇక పోసాని కృష్ణమురళీ పేరు డిసైడ్ అయ్యిందనుకున్న తరుణంలో… అసలు తనను ఎవరూ సంప్రదించలేదని పోసాని స్పష్టం చేయడంతో, అసలు ఈ షోలో ఎవరెవరు పాల్గొంటారు అనే దానిపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.
ఇందులో భాగంగా తాజాగా తెరపైకి వచ్చిన పేరు కే.ఏ.పాల్. ఈ పేరు విన్నాకా ‘బాబోయ్…’ అంటూ ఒక్కక్షణం స్టన్ అవ్వడం సాధారణమే. నాటి జార్జ్ బుష్ నుండి మొన్నటి మోడీ, నిన్నటి ట్రంప్ గెలవడం వెనుక ఉన్నది ఎవరో కాదు, తానే అన్నట్టు చెప్పే పాల్ వ్యాఖ్యలు వింటున్నా… వీక్షిస్తున్నా… పండే కామెడీ బ్రహ్మానందం కూడా చేయలేరని చెప్పడంలో సందేహం లేదు. అంతటి ప్రేక్షక ఆదరణ కలిగిన కే.ఏ.పాల్ ను ‘బిగ్ బాస్’ షోలో ఒక పార్టిసిపెంట్ గా పాల్గొనే విధంగా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు పుట్టుకొచ్చాయి.
అయితే ఇది అమలుకు నోచుకుంటే మాత్రం… బిగ్ బాస్ షో కాస్త, ఫుల్ కామెడీ షోగా మారిపోయి, ప్రేక్షకులు నవ్వుతూ పొట్టలు పట్టుకోవాల్సిందే! అయితే అసలు సినిమా పాల్ తో పాటు ఉండే ఇతర పార్టిసిపెంట్స్ కు తెలుస్తుంది. పాల్ వ్యాఖ్యలకు వీక్షకులకు పొట్ట చక్కలైనా, సహచరులకు మాత్రం చుక్కలు కనపడడం ఖాయం. ఈ వార్త వినడానికే ఇంత కామెడీగా ఉంటే, రేపు నిజంగా స్మాల్ స్క్రీన్ పైన ప్రత్యక్షమైతే… ఊహించుకోవడానికే కష్టసాధ్యంగా ఉంది కదూ..! అందుకే ఒక పుకారుగా ఈ వార్త మిగిలిపోతుందేమో చూడాలి.



