వీకెండ్ లో వచ్చే జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్స్ పర్లేదు గానీ, వీక్ డేస్ లో వచ్చే ‘బిగ్ బాస్’ ఎపిసోడ్స్ మాత్రం రుచిపచి లేకుండా చప్పగా సాగుతున్నాయన్న టాక్ తో కాస్త హంగామా చేయడానికి సర్వం సిద్ధమైనట్లుగా కనపడుతోంది. దీంతో తాజా ఎపిసోడ్ లో ధనా ధన్ ధన్ రాజ్ పై శివబాలాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంప చెళ్ళుమనిపించిన ప్రోమోను కట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు.
శివబాలాజీ బాగా కొట్టిన విషయాన్ని ఈ ప్రోమోలో చూపించారు గానీ, అసలెందుకు చేయి చేసుకున్నారు? అనే విషయాన్ని తేల్చకుండా ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచే విధంగా చేసారు. అయితే శివబాలాజీకి బాగా ఆగ్రహం ఎక్కువవుతోంది, నియత్రించుకోమంటూ జూనియర్ ఎన్టీఆర్ పలు మార్లు సూచనలు చేయగా, ఇదే అంశాన్ని తోటి సహచరులు అనేక సందర్భాలలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
‘కోపాన్ని అన్ని వేళలా ప్రదర్శించకూడదు… కోపాన్ని కూడా చిరు మందహాసంతో వ్యక్తం చేయాలి’ అని తారక్ సూచించిన వ్యాఖ్యలను శివబాలాజీ పట్టించుకోలేదన్న విషయం అర్ధమైంది. అందులోనూ ప్రస్తుతం ‘బిగ్ బాస్’ కెప్టెన్ గా వ్యవహరిస్తూ… ఇలా చిన్న పిల్లల మాదిరి చేయి చేసుకోవడం ఏంటి? నెటిజన్లు శివబాలాజీపై మండిపడుతున్నారు. ఇదంతా తాటాకు చప్పుడో లేక అణుబాంబో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.


