సహజంగా రాజకీయాలు అంటేనే ఎత్తులు పొత్తులు. అయితే అటు రాష్ట్ర అధికార పీఠం దక్కించుకోవడానికి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాయి, అలాగే కేంద్రంలో అధికారం దక్కించుకోవడానికి జాతీయపార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తుల ఒప్పందాలు కుదుర్చుకుంటాయి.
అయితే కేంద్రంలో ఎన్డీయే ఏర్పాటు కోసం రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పెట్టుకునే పొత్తులు ప్రాంతీయ పార్టీలకు ఒక రాజకీయ భరోసాగా భావించాలా.? లేదా బీజేపీ భవిష్యత్ ప్రణాళికలకు వేసే ఎత్తులుగా ఆలోచించాలా.?
బీజేపీ పొత్తుల పై ప్రస్తుతం బీహార్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే సామాన్యుడి నుంచి రాజకీయ విశ్లేషకుడు వరకు అందరి నోట ఇటువంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. బీజేపీ రాజకీయాలకు ‘ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో’ అన్న సూత్రం బాగా వంటపట్టినట్టుంది.
అందుకే నాడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో జేడీయూ కన్నా బీజేపీ అధిక ఎమ్మెల్యే సీట్లను నెగ్గినప్పటికీ అక్కడ తగ్గి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టింది. కానీ ఇప్పుడు అదే బీజేపీ నితీష్ ని రాష్ట్ర స్థాయి రాజకీయాల నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి బీహార్ రాష్ట్ర పగ్గాలను అందిపుచ్చుకోవడంలో నెగ్గింది.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగమైంది, కాబట్టి ఇటు రాష్ట్ర అభివృద్ధికి, అటు రాష్ట్ర ప్రభుత్వ సుస్థిరతకు ఎటువంటి ఢోకా ఉండదు అనే రాజకీయ భరోసా గతంలో బీజేపీ నుంచి లభించేది.
కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వ అధికారంలో ఉంటే బీజేపీ మిత్రపక్ష పార్టీల రాజకీయ భవిష్యత్ ఏంటి.? రాజకీయ పొత్తుల పేరుతో బీజేపీ ప్రాంతీయపార్టీల రాజకీయ బలాలను ఆక్రమించుకుంటుందా.? అందులో భాగంగానే పార్టీ అధినేతలను రాష్ట్ర రాజకీయాలకు దూరం చేస్తూ రాష్ట్రంలో బీజేపీ బలం పెంచుకునేందుకు బీహార్ తరహా రాజకీయాలను ప్రోత్సహిస్తుందా.?
అందులో భాగంగానే నేడు నితీష్ బీహార్ రాష్ట్ర రాజకీయాలకు దూరం జరిగారా.? రాజ్యసభ పేరుతో బీహార్ లో బీజేపీ, జేడీయూ రాజకీయ బలాన్ని హరిస్తుందా.? నేడు జేడీయూ అధినేత నితీష్ ని కేంద్ర రాజకీయాలలోకి ఎంటర్ చేయించి రాష్ట్ర రాజకీయాలను బీజేపీ హస్తగతం చేసుకోబోతుందా.?
ఒక్క సారి రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ తన ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంటే ఇక ఇక్కడ ప్రాంతీయ పార్టీల రాజకీయ భవిష్యత్ కి భరోసా ఉంటుందా.? నితీష్ రాజకీయ వారసుడిగా తెరమీదకొచ్చిన ఆయన తనయుడు నిశాంత్ కుమార్ రాజకీయ భవిష్యత్ బీజేపీ చేతికి దొరికిన ఒక రాజకీయ అస్త్రంగా మారనుందా.?
నేటి బీహార్ రాజకీయాలను నితీష్ కుమార్ రాజ్యసభ నామినేషన్ ను చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ రేపటి రోజున ఇక్కడేనని రాజకీయ వింతలు చేయబోతుందో.? ఇక్కడి ప్రాంతీయా పార్టీల నేతలలో ఎన్ని రాజకీయ చదరంగాలు ఆడబోతుందో అన్న చర్చ మొదలయ్యింది. అంటే బీజేపీ రాజకీయ దోస్తీ అంటే భరోసానే కాదు భయం కూడానా.?




